మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Aug 11, 2020 , 03:52:31

హితమ్‌ వినూత్నం

హితమ్‌ వినూత్నం

  • హోం ఐసొలేషన్‌ బాధితులకు సౌకర్యంగా టెలి మెడిసిన్‌
  • కొవిడ్‌ నివారణకు తెలంగాణ తీసుకుంటున్న చర్యలు భేష్‌
  • నీతిఆయోగ్‌ ప్రశంస.. మంత్రి ఈటల, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో భేటీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హోం ఐసొలేషన్‌లో ఉన్న కరోనా బాధితులను పర్యవేక్షించడానికి, వారికి టెలిమెడిసిన్‌ అందించేందుకు హితమ్‌ యాప్‌ను ప్రవేశపెట్టడం మంచి ప్రయత్నమని నీతిఆయోగ్‌ బృందం ప్రశంసించింది. తెలంగాణ వైద్యారోగ్యశాఖ తీసుకొచ్చిన ఈ యాప్‌ను ఇతరరాష్ర్టాల్లోనూ వివరిస్తామని పేర్కొన్నది. కొవిడ్‌ నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్‌గా ఉన్నాయని అభినందించింది. డాక్టర్‌ వినోద్‌కుమార్‌పాల్‌, ఆర్తి ఆహుజా, కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ రవీంద్రన్‌తో కూడిన నీతిఆయోగ్‌ బృందం రాష్ట్రంలో రెండ్రోజులపాటు పర్యటించింది. సోమవారం బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, అధికారులతో భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ పేషంట్లకు అందిస్తున్న వైద్యం, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై నీతిఅయోగ్‌ బృందం సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వినోద్‌కుమార్‌పాల్‌ మాట్లాడుతూ.. హితం యాప్‌ వివరాలతోపాటు, కొవిడ్‌ నియంత్రణ కోసం తెలంగాణ తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్ర్టాల్లోనూ వివరిస్తామని చెప్పారు. కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచడం వైరస్‌ నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో దవాఖానల సన్నద్ధత స్థాయి, వైరస్‌ నివారణ చర్యలు, బాధితులకు అందిస్తున్న సేవలపై నీతి అయోగ్‌ బృందం సంతృప్తి వ్యక్తంచేసింది. వైరస్‌ నియంత్రణకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు కలిసి చేస్తాయని తెలిపింది.

సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఆరోగ్య సంరక్షణ

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో కట్టుబడి పనిచేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. పరీక్షల నిర్వహణ, వైద్యసేవలపై కేంద్రబృందం సైతం సంతృప్తి వ్యక్తంచేసిందని తెలిపారు. గ్రామీణప్రాంతాల్లో వైరస్‌ నివారణకు కేంద్రబృందం సూచనలు ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. వైరస్‌ విస్తరించకుండా రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర బృందానికి తెలిపామన్నారు. పరీక్షలను ప్రతిరోజూ 40 వేలకు పెంచడంతోపాటు, ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయాన్ని వివరించినట్టు చెప్పారు. అంతకుముందు కేంద్ర బృందం జీహెచ్‌ఎంసీ అధికారులు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లతో కొవిడ్‌ పరిస్థితిపై సమీక్షించింది. ఈ సందర్భంగా కేంద్ర బృందం ఢిల్లీలో వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలపై ప్రజంటేషన్‌ ఇచ్చింది.


logo