గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:43:14

వ్యాధి తీవ్రత లేనివారికి ఇల్లూ భద్రమే!

వ్యాధి తీవ్రత లేనివారికి ఇల్లూ భద్రమే!

  • వైరస్‌ లోడ్‌ తక్కువ ఉంటే హోం ఐసొలేషన్‌ మేలు
  • ఇప్పటికే 14,518 మంది కరోనాపై గెలిచారు
  • తీవ్ర లక్షణాలుంటేనే దవాఖానలు అవసరం
  • మనోధైర్యం ఉంటే చాలంటున్న  వైద్యులు
  • హోం ఐసొలేషన్‌ రికవరీలో 2వ స్థానంలో తెలంగాణ
  • ఇంట్లో ఉండి చికిత్సపొందేవారికి ప్రభుత్వ కిట్‌
  • ప్రతిరోజూ వైద్యుల పరామర్శ.. చికిత్సకు సూచనలు
  • 24,983 హోం ఐసొలేషన్‌లో ఉన్నవారు 
  • 14,518 కోలుకున్న వారు 
  • 10,465 ప్రస్తుతం ఉన్నవారు 

ఖైరతాబాద్‌లో నివసించే తిరుపతి జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండేవాడు. కొవిడ్‌ కావొచ్చన్న అనుమానంతో ఫీవర్‌ హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌ అని తేలింది. వెంటనే వైద్యాధికారులు ఫోన్‌చేసి మాట్లాడారు. ఆయనకు వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉండటంతో హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో రోజూ వివరించేవారు. అలా 17 రోజులపాటు ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనలు పాటించి కొవిడ్‌ను జయించారు. తిరుపతి ఒక్కరేకాదు.. ఇలా ఇప్పటివరకు తెలంగాణలో ఏకంగా 14,518 మంది ఇంట్లోనే ఉండి కరోనాపై విజయం సాధించారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ కంటే దాని వల్ల ఏర్పరుచుకున్న భయమే ఎక్కువ ప్రమాదకరమని నిపుణులు చెప్తున్నారు. నిజానికి కరోనా వైరస్‌ వచ్చినప్పటికీ 85% మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. 5% మందిలో మాత్రం తీవ్ర లక్షణాలు ఉంటున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్దసంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలను ప్రారంభించింది. ఆర్టీపీసీఆర్‌కు తోడు ర్యాపిడ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నది. పాజిటివ్‌ అని తేలినా ఎలాంటి లక్షణాలు లేనివారు లేదా స్వల్ప లక్షణాలున్నవారు ఆందోళన చెందవద్దని వైద్యులు చెప్తున్నారు. ఇంట్లోనే (హోం ఐసొలేషన్‌) ఉంటూ కొవిడ్‌ను జయించవచ్చు. ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరగడంవల్ల విలువైన సమ యం, డబ్బు వృథా అవుతాయి. దవాఖానల్లో ఒంటరిగా ఉండే బదులు ఇంట్లో మరింత స్వేచ్ఛ గా, ధైర్యంగా ఉండవవచ్చు. హోం ఐసొలేషన్‌లో ఉండేవారు తాము సూచించిన జాగ్రత్తలు పాటించగలిగితే 10 రోజుల్లోనే వైరస్‌ నుంచి విముక్తులు కావచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు. 

కేంద్రం సూచన మేరకు హోం ఐసొలేషన్‌

లక్షణాలు లేకున్నా చాలామందిలో కరోనా పాజిటివ్‌ వస్తున్నందున కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఇండ్లలోనే చికిత్స అందించాలని పే ర్కొంది. ఇంట్లో వసతులున్న వారంతా హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు అవకాశం కల్పించిం ది. ఇప్పటిదాకా 17 రోజులుగా ఉన్న ఐసొలేషన్‌ గడువును పదిరోజులకు కుదించింది. ఈ కాలంలో వరుసగా 3రోజులపాటు ఎలాంటి లక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చార్జి చేయొచ్చని సూచించింది. హోం ఐసొలేషన్‌ నుంచి డిశ్చా ర్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని స్పష్టంచేసింది. కేంద్రం సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం.. లక్షణాలు లేని పాజిటివ్‌ రోగులను హోం ఐసొలేషన్‌కు తరలిస్తున్నది. హోం ఐసొలేషన్‌లో రికవరీ అయిన కేసులు ఢిల్లీలో అత్యధికం. తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది.

నిర్ణయంలోనే సగం విజయం

హోం ఐసొలేషన్‌లో ఉండాలనే నిర్ణయంలోనే స గం విజయం దాగున్నది. పది రోజులపాటు  ఇంట్లో నే ఓ ప్రత్యేక గదిలో 10 రోజుల పపాటు ఐసొ లేషన్‌లో ఉండాలి. గదిని శుభ్రంగా ఉంచు కోవడం తోపాటు వెలుతురు, గాలి బాగా ఉండేలా చూసు కోవాలి. తప్పనిసరిగా ప్రత్యేక బాత్‌రూం ఉండాలి. ఉపయోగించే పాత్రలు, వస్తువులు, దుస్తులను ఇతరులు తాకకూడదు. మాస్కును అన్ని వేళలా ధరించాలి. తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్య సేతు యాప్‌తో అనుసంధానమై ఉండాలి. పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని డెరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ జీ శ్రీనివాస రావు చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 24,983 మంది రాష్ట్రంలో హోం ఐసొలేషన్‌లో ఉన్నారని, వీరిలో చాలామంది కరోనాను జయించారని తెలిపారు. హోం ఐసొలేషన్‌లో ఉండేవారు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనా పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇంట్లో ఉండే తాను వైరస్‌ను జయించానని హైదరాబాద్‌కు చెందిన షేక్‌ అజహర్‌ చెప్పారు. తనకు పాజిటివ్‌ వచ్చినా.. వ్యాధి లక్షణాలు లేకపోవడంతో ఇంట్లోనే ఉండాలని వైద్యులు సూచించారని, మందులు, ఆహారం గురించి వివరించారని ఆయన తెలిపారు. రోజుకు ఒకటి రెండు సార్లు వైద్యులు ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి ఎప్పటిప్పుడు తెలుసుకునేవారని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పేవారని పేర్కొన్నారు. తాను 15 రోజులపాటు హోం ఐసొలేషన్‌లో ఉండి.. ఎలాంటి లక్షణాలు కనిపించకపోవటంతో బయటకు అడుగు పెట్టానని తన స్వీయానుభవాన్ని పంచుకున్నారు.

దినచర్య ఎలా ఉండాలి?

పది రోజుల్లో వైరస్‌ను జయిస్తున్నాననే నమ్మకంతో ఉండాలి. ఎలాంటి ఆందోళన చెందకూడదు. కరోనా వార్తలు, విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పౌష్టికాహారం తీసుకోవాలి. మూడు పూటలా గోరువెచ్చని నీటిని తాగాలి. మద్యం, సిగరెట్లు, డ్రగ్స్‌ వంటివి పూర్తిగా మానేయాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులకు తెలిపి.. సూచించిన మందులలు వాడాలి. రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, విటమిన్‌ ట్యాబ్‌లెట్స్‌ తీసుకోవాలి. ప్రతిరోజు బీపీ, జ్వరం, ఆ యాసం.. ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా అని పరీక్షించుకోవాలి. ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇతర గ్యాడ్జెట్స్‌కు ఎక్కువ సమ యం కేటాయించకుండా సమయానికి నిద్రపోవా లి. ఉదయం లేదా సాయంత్రం అరగంట పాటు వ్యాయామం లేదా యోగా చేసుకోవాలి.

అత్యవసరం అయితే

ప్రభుత్వం అన్నివేళలా ఆదుకునేందుకు సిద్ధం గా ఉందన విషయాన్ని మరిచిపోవద్దు. జ్వరం పెరగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు, ఛాతి లో నొప్పి, ఇతర లక్షణాలు ఎక్కువైతే అప్పటివరకు అనుసంధానంలో ఉన్న ప్రభుత్వ వైద్యులకు సమాచారం అందించాలి. లేదా 104 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. వారు అంబులెన్స్‌లో దగ్గర్లోని కొవిడ్‌ చికి త్స కేంద్రానికి తరలిస్తారు. లేదంటే నేరు గా గాంధీ దవాఖానకు వెళ్లవచ్చు. అకస్మాత్తుగా లక్షణాలు ఎ క్కువైన సమయంలో ధైర్యంగా ఉండాలి.  ప్రైవేటు దవాఖానల చుట్టూ తిరిగి వృథా చేసుకోవద్దు. పరిస్థితి చేయి దాటాక ప్రభుత్వ దవాఖానకు వస్తే వైద్యు లేమీ చేయలేరు.

ఇంట్లో ఇవి ఉండాల్సిందే 

డిజిటల్‌ థర్మామీటర్‌ వెంట ఉంచుకొని తరు చూ జ్వరం ఎంత ఉన్న దో చూసుకోవాలి. బీపీ ఆపరేటర్‌, పల్స్‌ ఆక్సీమీటర్‌ అందుబాటులో ఉం చుకోవాలి. పారాసిటమాల్‌ 650, విటమిన్‌ సీ, డీ, జింక్‌ ట్యాబ్‌లెట్స్‌ ఉండాలి. ఒకటిరెండు రకాల యాంటీబయాటిక్స్‌ ట్యాబ్‌లెట్స్‌ ఉండాలి. వీటన్నింటిని వైద్యుల సలహామేరకు వా డాలి. హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించినవారికి రాష్ట ప్రభుత్వమే వీటిని కిట్‌ రూపంలో అందిస్తుంది.

ఎవరికి హోం ఐసొలేషన్‌?

పాజిటివ్‌ అని తేలిన వెంటనే వైద్యాధికారులు ఫోన్‌ చేస్తారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తారు. లక్షణాలు లేనివారిని, అతి స్వల్ప, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు, హెచ్‌ఐవీ బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నవారు హోం ఐసొలేషన్‌లో ఉండేందుకు అర్హులు కాదు. 60 ఏండ్ల పైబడిన రోగులు, రక్తపోటు, డయాబెటిస్‌, గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారిని డాక్టర్ల సూచన మేరకు హోం ఐసొలేషన్‌కు అనుమతిస్తారు. 

లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉండండి

పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేనివారు ఇంట్లో హాయిగా ఉండొచ్చు. కుటుంబ సభ్యులకు దూరంగా రెండు వారాల పాటు ప్రత్యేక గదిలో ఉంటే చాలు. ప్రభుత్వం తరఫున వైద్యులు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటున్నారు. ఆరో గ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. బయట తప్పుగా ప్రచారం జరుగుతున్నది. ఇంట్లో ఉండి నేను కొవిడ్‌ బారినుంచి తప్పించుకున్నాను. కరోనాకు వాక్సిన్‌ ధైర్యమే. మనం ఎంత ధైర్యంగా ఇంట్లో ఉంటే అంత బలంగా వైరస్‌ను ఎదుర్కోగలం. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలున్నవారు మనోధైర్యంతో, జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండండి.

- సద్దాల విజయ్‌ భాస్కర్‌, సినిమాటోగ్రాఫర్‌, హైదరాబాద్‌logo