గురువారం 28 మే 2020
Telangana - May 14, 2020 , 21:55:59

కరోనా ఫ్రీ జిల్లాగా సూర్యాపేట

కరోనా ఫ్రీ జిల్లాగా సూర్యాపేట

సూర్యాపేట : కరోనా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌ తర్వాత అత్యధిక సంఖ్యలో నమోదైన సూర్యాపేట జిల్లా పూర్తిగా కోలుకుని కరోనా ఫ్రీ జిల్లాగా మారింది. ఏప్రిల్‌ 2న తొలి పాజిటివ్‌ నమోదు కాగా 21 రోజుల్లో వైరస్‌ సోకిన వారి సంఖ్య 83కు చేరిన విషయం తెలిసిందే. వారంతా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఒక్కొక్కరుగా డిశ్చార్జి అయి ఇళ్లకు చేరుకున్నారు. బుధవారం నాటికి 70 మంది రాగా మిగిలిన 13 మంది గురువారం డిశ్చార్జి అయ్యారు. జిల్లా కేంద్రంలో నమోదైన తొలి కేసు నుంచి చివరి కేసు వరకు ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. సమీక్షలు నిర్వహిస్తూ, ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల్లో ధైర్యం నింపారు. అలాగే కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్‌ పాజిటివ్‌ కేసుల ప్రాంతాల్లో యంత్రాంగాన్ని రంగంలోకి దింపి ప్రజలను బయటికి రాకుండా కట్టడి చేశారు. రద్దీ ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను పరిశీలించి, పాజిటివ్‌ వ్యక్తులు మాట్లాడిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టలతోపాటు అనుమానితులందరినీ గుర్తించారు. 

వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వైద్యపరీక్షలు చేశారు. జిల్లాలో 749 మంది నుంచి రక్త నమూనాలు తీసి పరీక్షలు చేయగా దాదాపు 1250కి పైనే మందిని ప్రభుత్వ క్వారంటైన్‌లలో ఉంచారు. వీరితోపాటు మరో 7010 మందిని హోంక్వారంటైన్‌ చేశారు. మొత్తం 9009 మంది అనుమానితులను మెడికల్‌ సిబ్బంది అనునిత్యం పరీక్షించగా జిల్లాలో 83 మంది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయి పర్యవేక్షణ చేయడంతోపాటు పక్కా ప్రణాళికలు రూపొందించి పటిష్ట లాక్‌డౌన్‌ చేపట్టడంతో నేడు జిల్లాలో కరోనా వైరస్‌ కేసుల నుంచి కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ క్వారంటైన్‌లో ఎవరూ లేరు. హోంక్వారంటైన్‌లలో 6509 ఉండగా వీరు కూడా త్వరలో క్వారంటైన్‌ గడువు ముగియనుంది. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి  మాట్లాడుతూ కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు వందశాతం కోలుకొని ఇళ్లకు చేరుకున్నారన్నారు. 24 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలిపారు. logo