గురువారం 09 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:20

ఒక్కరోజే 920 కేసులు

ఒక్కరోజే 920 కేసులు

  • జీహెచ్‌ఎంసీలో 737 మందికి పాజిటివ్‌
  • చికిత్సకు 34 దవాఖానల గుర్తింపు.. 
  • ప్రత్యేక శిబిరాల్లో శాంపిళ్ల  సేకరణ నిలిపివేత
  • ఐదుగురి మృతి, 327 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దడపుట్టిస్తున్నాయి. గురువారం కొత్తగా 920 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 737 వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌ 60, కరీంనగర్‌ 13, రాజన్న సిరిసిల్ల 4, మహబూబ్‌నగర్‌, నల్లొండ 3 చొప్పున, ములుగు, వరంగల్‌ అర్బన్‌, మెదక్‌ 2 చొప్పున, వరంగల్‌ రూరల్‌, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్‌, జనగామ, మహబూబ్‌బాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీంఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 70,934 టెస్టులుచేయగా, 11,364 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 230 మంది మరణించారు. 4,688 మంది కొలుకొని డిశ్చార్జి అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. 

రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం 34 దవాఖానలను ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 17,081 పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 1,083 పడకలు మాత్రమే బాధితులతో భర్తీకాగా మిగిలినవి ఖాళీగా ఉన్నాయి. 11,152 ఐసొలేటెడ్‌ పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యం ఉన్న 3,482 పడకలు, 901 ఐసీయూ పడకలు, 463 వెంటిలేటర్‌ పడకలు ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ స్పష్టంచేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారి కోసం ఏర్పాటుచేసిన శిబిరాల్లో శాంపిళ్ల సేకరణ ప్రక్రియను రెండ్రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రజారోగ్యం, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సేకరించిన శాంపిళ్ల పరీక్షలు పూర్తిచేసేందుకు, సేకరణ సెంటర్లను శానిటైజేషన్‌ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. దవాఖానల్లో మాత్రం యథావిధిగా నమూనాలు సేకరిస్తారని స్పష్టంచేశారు. 

నేటి నుంచి కేంద్రబృందం పర్యటన

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలను పరిశీలించడానికి కేంద్ర వైద్యారోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని బృందం శుక్రవారం నుంచి 29వ తేదీవరకు గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణలో పర్యటించనున్నది. నాలుగురోజులపాటు పర్యటించి ఆయా రాష్ర్టాల్లో వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నది.

12 మంది జర్నలిస్టులకు అర్థికసాయం

హైదరాబాద్‌లో తాజాగా కరోనా సోకిన 12 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.20 వేల చొప్పున ఆర్థికసాయం అందించినట్టు మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ గురువారం తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉన్న ఐదుగురికి రూ.10 వేల చొప్పున సాయమందించామన్నారు. ఇప్పటివరకు మొత్తం 99 మంది జర్నలిస్టులకు, హోంక్వారంటైన్‌లో ఉన్న 52 మందికి కలిపి రూ.25 లక్షల సాయం అందించామని వివరించారు.

కరోనా బాధితుల కోసం రోబోల సృష్టి భేష్‌ 


కరోనా సోకినవారి అవసరాలను తీర్చేందుకు రోబోను తయారుచేయడం గొప్ప విషయమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. రక్షణరంగ పరికరాలను తయారుచేసే న్యూక్లియోనిక్స్‌ కంపెనీ రూపొందించిన యాంటీ కరోనా ఉత్పత్తులతోపాటు రోబోను మంత్రి ఈటల గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ప్రజలు కరోనా బారిన పడకుండా.. కరెన్సీ, మొబైల్స్‌, పత్రాలు, వ్యాలెట్స్‌ తదితరాలను యూవీ కిరణాల ద్వారా శానిటైజ్‌చేసే పరికరాలను తయారుచేయడాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో న్యూక్లియోనిక్స్‌ మేనేజ్‌మెంట్‌ టీం ఎండీ జే నరేందర్‌రెడ్డి, డిఫెన్స్‌ అండ్‌ ఐటీ డైరెక్టర్‌ జే నిషాంత్‌రెడ్డి, టెక్నికల్‌ డైరెక్టర్‌ జే ధీరజ్‌రెడ్డి, కే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు

వివరాలు  
గురువారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
92011,364
డిశ్చార్జి అయినవారు
3274,688 
మరణాలు
5230
చికిత్స పొందుతున్నవారు
-6,446

logo