సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:07

నిమ్స్‌లో ఇద్దరికి టీకా తొలివిడుత కొవాగ్జిన్‌ ట్రయల్స్‌

నిమ్స్‌లో ఇద్దరికి టీకా తొలివిడుత కొవాగ్జిన్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాక్సిన్‌ తయారీలో కీలక ముందడుగు. కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌' క్లినికల్‌ ట్రయల్స్‌ నిమ్స్‌ దవాఖానలో మొదలయ్యాయి. సోమవారం ఇద్దరు వలంటీర్లపై వైద్యులు కొవాగ్జిన్‌ను ప్రయోగించారు. వీరిద్దరినీ 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచారు. పౌష్టికాహారం ఇస్తూ, తరుచూ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతున్నాయో లేదో పరిశీలిస్తారు. కొవాగ్జిన్‌ ఇచ్చిన ఇద్దరూ పురుషులేనని వైద్యులు వెల్లడించారు. వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పటివరకు ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసంస్థ భారత్‌ బయోటెక్‌.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎమ్మార్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) సహకారంతో కొవాగ్జిన్‌ పేరుతో టీకాను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా తయారైన తొలి వ్యాక్సిన్‌ ఇదే. ఇప్పటికే జంతువులపై వ్యాక్సిన్‌ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో మానవులపై ప్రయోగాలు చేసేందుకు డీజీసీఐ ఇటీవల అనుమతిచ్చింది. ఈ మేరకు నిమ్స్‌సహా దేశవ్యాప్తంగా 12 చోట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. తొలిదశలో 375 మందిపై ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రెండోదశలో 750 మందిపై ప్రయోగాలు చేయనున్నారు.  logo