సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:27:01

సైబర్‌ దారుణాలు

సైబర్‌ దారుణాలు

  • కొవిడ్‌-19 పరీక్షలు, లోన్ల పేరిట మోసాలు
  • హైదరాబాద్‌ సహా పలు నగరాల నుంచి 20 లక్షల మంది ఈ-మెయిల్‌ ఐడీల సేకరణ

‘కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో మీకు కేంద్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తుంది. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. మీకు అవసరమైతే మేం పంపించే లింక్‌ను తెరిచి పూర్తి వివరాలు పంపండి’ ఓ వ్యాపారికి వచ్చిన నకిలీ ఈ-మెయిల్‌ ఇది..

‘మీకు కరోనా వైరస్‌ సోకిందని అనుమానంగా ఉన్నదా? మీ ప్రాంతంలోనే నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. మీ ఈ-మెయిల్‌కు పంపే లింక్‌ను తెరిచి వివరాలు నమోదుచేయండి’ ఓ సామాన్యుడికి వచ్చిన దొంగ మెయిల్‌ ఇది..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రజల అవసరాలు, భయాలే ఆసరాగా సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి కొవిడ్‌-19 రుణాల పేరిట పలు భారీ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని మోసం చేస్తున్నారు. అచ్చం ప్రభుత్వ లోగోలు, అక్షరాల్లో చిన్నపాటి మార్పులతో ఈ-మెయిల్‌ ఐడీలు తయారుచేస్తున్నారు. ఈ-మెయిల్స్‌కు లింక్‌లు పంపుతూ కంప్యూటర్లు, ఫోన్లను హ్యాక్‌ చేస్తున్నారు. కరోనా వైరస్‌ హెచ్చరికలు, సమాచారం, ఇతర సేవల పేరిట వచ్చే ఈ-మెయిల్స్‌ను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సీఈఆర్టీ-ఇన్‌) హెచ్చరిస్తున్నది. కరోనాకు సంబంధించి ప్రభుత్వ సహాయక కార్యక్రమాలంటూ కొన్ని హానికర లింక్‌లతో ఈ-మెయిల్స్‌ పంపుతున్నట్టు వెల్లడించింది. ప్రత్యేకించి సైబర్‌ నేరగాళ్లు భారతీయులే లక్ష్యంగా ఈ తరహా ఫిషింగ్‌ మెయిల్స్‌ పంపుతున్నారని తెలిపింది. ఆదివారంనుంచి ఈ తరహా దాడులు దేశంలో మొదలయ్యాయని పేర్కొన్నది. సైబర్‌ నేరగాళ్ల వద్ద భారత్‌కు చెందిన దాదాపు 20 లక్షల మంది పౌరుల ఈ మెయిల్‌ ఐడీలు ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఇందులో హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌, ముంబై సహా పలు ప్రముఖ నగరాల నుంచి కరోనా పరీక్షల పేరిట ఈ మెయిల్స్‌ ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టు తమ పరిశోధనలో తేలిందని సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది. ఒక ఈ-మెయిల్‌ను ట్రాక్‌చేసి, తర్వాత అందులోని ఇతర కాంటాక్ట్‌, ఈ మెయిల్స్‌ను సైబర్‌ మోసగాళ్లు సేకరిస్తున్నట్టు తెలిపింది. కరోనా పరీక్షల కోసం అంటూ ఈ-మెయిల్స్‌కు పంపే లింక్‌లను తెరువొద్దని సూచించింది. తెరిస్తే నేరగాళ్లు మన కంప్యూటర్‌, ఫోన్లలోకి వైరస్‌లు పంపి సమాచారం సేకరించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది.

సెర్ట్‌- ఇన్‌ జాగ్రత్తలు

  • ప్రభుత్వ అధికారులు, ఇతర అధికారిక సంస్థల ఈ-మెయిల్‌ ఐడీలను పోలిన విధంగా చిన్నపాటి అక్షరాల మార్పులతో వచ్చే నకిలీ ఈ మెయిల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • ప్రధానంగా [email protected] వంటి ఈ-మెయిళ్లు ద్వారా మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నది.
  • మన కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న వారినుంచి వచ్చే ఈ మెయిల్స్‌లోని అటాచ్డ్‌ ఫైల్స్‌పై క్లిక్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాలి. 
  • పొరపాటున ఇలాంటి ఈ-మెయిల్స్‌ను క్లిక్‌    చేసి మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే  ‘[email protected]కు సమాచారం అందించాలి.


logo