శనివారం 11 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:52:45

ఒక్కరోజే 269 కేసులు

ఒక్కరోజే 269 కేసులు

  • జీహెచ్‌ఎంసీలో 214 మందికి వైరస్‌
  • ఒకరు మృతి, 151 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా రోజురోజుకు విజృంభిస్తున్నది. కొద్దిరోజులుగా రెండు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం రికార్డుస్థాయిలో 269 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 214 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్‌ అర్బన్‌ 10, కరీంనగర్‌ 8, జనగామ, ములుగు 5 చొప్పున, మెదక్‌, సంగారెడ్డి 3 చొప్పున, వనపర్తి, మేడ్చల్‌ 2 చొప్పున, జయశంకర్‌ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5,675 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 192 మంది మరణించారు. మొత్తం 45,911 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఇందులో 40,236 మందికి నెగెటివ్‌గా తేలింది. ఒక్క బుధవారమే 1,096 పరీక్షలుచేసినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

దీర్ఘకాలిక రోగులపై వైరస్‌ పంజా

రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి మరింత శాపంగా మారుతున్నది. బీపీ, షుగర్‌, కిడ్నీ సంబంధ సమస్యలున్నవారు ఈ వైరస్‌ భారిన పడితే ప్రాణాంతకంగా పరిణమిస్తున్నది. ఆరోగ్యశాఖ తాజాగా విడుదలచేసిన బులిటెన్‌ ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 192 మంది కరోనాతో మరణించగా, 81శాతం మంది బీపీ, షుగర్‌, గుండె జబ్బులు, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారే ఉండటం గమనార్హం. ప్రధానంగా బీపీ, షుగర్‌ బాధితులకు కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. మొత్తం మరణాల్లో 65 శాతం మందికి ఈ రెండు వ్యాధులు ఉన్నాయి. రాష్ట్రంలో పురుషులే ఎక్కువగా ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు నమోదైన 5,675 కేసుల్లో పురుషులు 3,671 (65 శాతం) ఉన్నారు.

యువత, మధ్యవయస్కులవారిపైనా..

కరోనా 20 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్కులపై పంజా విసురుతున్నది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 3,499 మంది 20- 50 ఏండ్ల మధ్యవారే కావటం గమనార్హం. పదేండ్లలోపువారు 284 మంది కాగా, 11 నుంచి 20 ఏండ్లవారు 411 మంది, 51- 70 ఏండ్లవారు 1,285 మంది ఉన్నారు. ఇక 71 ఏండ్ల పైబడినవారు 196 మంది ఉన్నారు.logo