మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:46:59

కొత్తగా 164 మందికి కరోనా

కొత్తగా 164 మందికి కరోనా

జీహెచ్‌ఎంసీలోనే 133 మందికి 9 మంది మృతి.. 121 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 164 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 133 నిర్ధారణ కాగా, మేడ్చల్‌ 6, రంగారెడ్డి 6, సంగారెడ్డి 4, నిజామాబాద్‌ 3, మహబూబ్‌నగర్‌ 2, కరీంనగర్‌ 2, ములుగు 2, సిద్దిపేట 1, యాదాద్రి భువనగిరి 1, మంచిర్యాల 1, కామారెడ్డి 1, మెదక్‌ 1, వనపర్తి జిల్లాల్లో 1 ఉన్నాయి. ఇక వైరస్‌ తీవ్రత, ఇతర కారణాలతో 9 మంది మరణించారు. 

గాంధీలో కరానా రోగులకు డీఎంఈ పరామర్శ

గాంధీ దవాఖానలో తగిన సౌకర్యాలు లేవంటూ దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులకు అక్కడ అందిస్తున్న చికిత్స, సౌకర్యాల కల్పనను వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి పరిశీలించారు. శుక్రవారం గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ రాజారావు, ఇతర వైద్య బృందంతో కలిసి ఆయన అన్ని వార్డులను కలియ తిరిగారు. కరోనా ప్రత్యేక దవాఖానగా నిర్ణయించిన గాంధీలో 2, 3, 4, 5, 6, 7, 8 అంతస్తుల్లో తగిన ఏర్పాట్లు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. డీఎంఈ బాధితులను ఒక్కొక్కరిగా పరామర్శించారు. ప్రధానంగా మూడో అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డులోని బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అందుతున్న సేవలు, సౌకర్యాలు పరిశీలించిన రమేశ్‌రెడ్డి.. రోగులకు ఏ ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని, అదనపు సౌకర్యాలు కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని వైద్య బృందానికి సూచించారు.

గాంధీ ఆర్‌ఎంవో బదిలీ

ఇటీవల కరోనాతో మరణించినవారి మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగించిన సమయంతో తారుమారవడంతో గాంధీ దవాఖాన ఆర్‌ఎంవో డాక్టర్‌ జయకృష్ణను వైద్యారోగ్యశాఖ శుక్రవారం బదిలీచేసింది. మృతదేహాల అప్పగింతలో నిర్లక్ష్యానికిగాను ఆయనను ఉస్మానియా దవాఖానకు బదిలీచేశారు. ఆయన స్థానంలో ఇంచార్జిగా డాక్టర్‌ శేషాద్రిని నియమించారు.


logo