సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:47

హోం ఐసొలేషన్‌ కిట్లు రెడీ

హోం ఐసొలేషన్‌ కిట్లు రెడీ

  • హైదరాబాద్‌లో 15 వేలు పంపిణీ
  • సిద్ధంగా మరో ఐదు వేల కిట్లు
  • బల్దియా వెబ్‌సైట్‌లో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా బారినపడి హోంఐసొలేషన్‌లో ఉంటున్నవారికి సర్కారు అండగా నిలిచింది. ప్రతి బాధిత కుటుంబానికి మందులు, శానిటైజర్లతో కూడిన కిట్లను ఉచితంగా పంపిణీచేస్తున్నది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇప్పటికే 15 వేల మందికి ఈ కిట్లను పంపిణీచేయగా, మరో 5 వేల కిట్లు సిద్ధంగా ఉన్నాయి. వైద్యశాఖ లెక్కల ప్రకారం ఇంకా 12 వేలమందికి హోం ఐసొలేషన్‌ కిట్లు పంపిణీచేయాల్సి ఉన్నది. అవసరాలకు అనుగుణంగా ఎన్ని కిట్లనైనా పంపిణీచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ రికార్డుల ప్రకారం పాజిటివ్‌ వచ్చినవారి ఇండ్లకు వెళ్లి వీటిని పంపిణీచేస్తున్నారు. 

ఈ కిట్‌లో ప్రిస్‌క్రిప్షన్‌, విటమిన్‌-సీ ట్యాబ్లెట్స్‌-34, జింక్‌ ట్యాబ్లెట్స్‌-17, బీ-కాంప్లెక్స్‌ ట్యాబ్లెట్స్‌-17, క్లాత్‌ మాస్కులు-6, శానిటైజర్‌-1, లిక్విడ్‌ హ్యాండ్‌వాష్‌-1, గ్లౌస్‌- రెండు జతలు, సోడియం హైపో క్లోరైట్‌ సొల్యూషన్‌ బాటిల్‌ -1, హోం ఐసొలేషన్‌ నియమాలతో కూడిన బ్రోచర్‌ ఉన్నాయి. కాగా, కరోనా పాజిటివ్‌ కేసుల సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారో తెలిసేలా వార్డు, సర్కిల్‌, జోన్‌ సమాచారాన్ని పొందుపరిచినట్టు పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని రోజువారీగా అప్‌డేట్‌చేయనున్నట్టు వివరించారు.


logo