ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 08, 2020 , 02:49:35

52,750 కోట్ల ఆదాయ నష్టం

52,750 కోట్ల ఆదాయ నష్టం

  • రాష్ట్ర రాబడిపై కరోనా, లాక్‌డౌన్‌ దెబ్బ
  • కేంద్రం నుంచి భారీ స్థాయిలో కోతలు
  • రావాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు
  • బడ్జెట్‌ అంచనాల్లో సవరణలు తప్పవు
  • సీఎం కేసీఆర్‌కు అధికారుల వివరణ
  • ప్రాధాన్యక్రమాన్ని నిర్దారించుకొని ఆర్థిక నిర్వహణకు ప్రణాళిక తయారీ 
  • బడ్జెట్‌పై మధ్యంతర సమీక్షలో సీఎం
  • కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర పథకాల కింద : రూ.26,452 కోట్లు
  • రాబోయే మొత్తాలపై అంచనా: రూ.20,821 కోట్లు 
  • రెండింటిలో కోతపై అంచనా: రూ.5,631 కోట్లు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా, లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారు. రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటును 15 శాతంగా అంచనా వేసి 2020-21 బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించామని, అయి తే కరోనా వల్ల 15% వృద్ధి కనిపించకపోగా, గతేడాది వచ్చినంత ఆదాయం కూడా రాలేదని తెలిపారు. ఈ ఏడాది రాష్ర్టానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందాయని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది రూ.68,781 కోట్లు మాత్రమే సమకూరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీంతో స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనున్నదని చెప్పారు. 

కేంద్రం వాటాలోనూ కోత 

కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ర్టానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గిందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి రూ.16,727 కోట్లను పన్నుల్లో వాటాగా చెల్లిస్తామని కేంద్రం బడ్జెట్‌లో పేర్కొన్నదని చెప్పారు. ఆ మేరకు ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య వాటాగా రూ.8,363 కోట్లు రావాల్సి ఉన్నదని, కానీ.. రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.16,727 కోట్లకు గాను రూ.11,898 కోట్లు మాత్రమే వాటాగా వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ర్టానికి మరో రూ.4,829 కోట్ల నష్టం కలుగుతుందని తెలిపారు. 

మరోవైపు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఈ ఏడాది రాష్ర్టానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. దీని ప్రకారం అక్టోబర్‌ వరకు రూ.5,673 కోట్లు రావాల్సి ఉండగా, రూ.4,592 కోట్లు మాత్రమే వచ్చాయని, రూ.1,081 కోట్లు తగ్గాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని, మొత్తంగా రూ.802 కోట్లు కోత పడే అవకాశం ఉన్నదని వివరించారు. ఈ నేపథ్యంలో 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని సూచించారు. దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. రాష్ర్టానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రం వైఖరి దారుణం 

ఇటీవలి వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం అందించకపోవడం దారుణమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం కలిగితే కనీసం స్పందించలేదని విచారం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే అని మరోసారి నిరూపణ అయ్యిందని విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ర్టానికి ఎంతో నష్టం జరిగినా కేంద్రం నుంచి ఒక్క నయాపైసా కూడా సాయం అందలేదని ఆర్థికశాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షిస్తుండగా కేంద్ర ప్రభుత్వ వరద సాయం అంశం ప్రస్తావనకు వచ్చింది. 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇటీవలి వర్షాలతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయన్నారు. దీంతో అనేక రంగాలకు తీవ్ర నష్టం కలిగిందని, రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం జరిగిందని చెప్పారు. ప్రాథమికంగా దాదాపు రూ.5 వేల కోట్ల వరకు నష్టం కలిగినట్టు అంచనా వేశామని తెలిపారు. తక్షణసాయంగా రూ.1,350 కోట్లను అందించాలని సీఎం కేసీఆర్‌ అక్టోబర్‌ 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి కూడా వ్యక్తంచేశారన్నారు. వారు సీఎం కేసీఆర్‌తో స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారని చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించామని, కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా అందించలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ప్రభుత్వానివి ‘శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే’ అనే విషయం మరోసారి నిరూపణ అయిందని అన్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా సాయం అందించకపోవడం కేంద్రం వైఖరిని తేటతెల్లం చేస్తున్నదని విమర్శించారు. సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రానివి శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు కేంద్ర ప్రభుత్వానివి ‘శుష్క ప్రియాలు, శూన్య హస్తాలే’ అనే విషయం మరోసారి నిరూపణ అయింది. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా సాయం అందించకపోవడం కేంద్రం వైఖరిని తేటతెల్లం చేస్తున్నది.  దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం కలిగితే కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదు.

- సీఎం కేసీఆర్‌