శనివారం 11 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:51:48

మరణాలు 0.00054 శాతమే

మరణాలు 0.00054 శాతమే

  • జనాభాతో పోలిస్తే మోర్టాలిటీ తక్కువే
  • 54 కొవిడ్‌ వైద్యశాలలున్నట్టు ప్రచారం  
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర జనాభాతో పోల్చినప్పుడు కొవిడ్‌-19 మరణాల రేటు చాలా తక్కువని హైకోర్టు అభిప్రాయపడింది. 3.5 కోట్ల జనాభాకుగాను మోర్టాలిటీ రేటు 0.00054 మాత్రమేనని పేర్కొన్నది. కరోనా టెస్ట్‌లు, పీపీఈ కిట్లు, ఇతర అంశాలపై దాఖలైన పలుపిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ నిర్వహించింది. ఈ విచారణకు గాంధీ వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. 

కొవిడ్‌-19 వ్యాప్తి, శాంపిల్‌ టెస్ట్‌ తదితర వివరాలన్నీ మీడియా బులిటెన్‌లో ఉండేలా చూడాలని ధర్మాసనం తెలిపింది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున వార్డులవారీగా కేసుల వివరాలు వెల్లడించాలని, తద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నది. తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో రాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌లను చేపట్టాలని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ, రం గారెడ్డి జిల్లా పరిధిలో 10 రోజుల వ్యవధిలో 50 వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు సరిపోవని, లక్ష్యాన్ని చేరాలంటే రోజుకు కనీసం 5 వేల పరీక్షలు చేయాలని సూ చించింది. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల మేరకు పాజిటివ్‌ వచ్చివారికి కాంటాక్ట్‌లో ఉన్న దగ్గరి వ్యక్తులకు కూడా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నది. 

ఆ 54 దవాఖానలపై అందరికీ తెలుపండి

రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన 54 కొవిడ్‌-19 దవాఖానల వివరాలు, సాధారణ, ఐసీయూ బెడ్ల సం ఖ్యను అందరికీ తెలియజేయాలని హైకోర్టు సూచించింది. జిల్లా కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లోని కొవిడ్‌-19 దవాఖానల గురించి ప్రజలకు వివరించాలని తెలిపింది. గత విచారణ సందర్భంగా తాము ఆదేశించిన విధంగా పీపీఈ కిట్ల పంపిణీ, ఇతర వసతులపై నిమ్స్‌, చెస్ట్‌, ఫీవర్‌, కింగ్‌ కోఠి దవాఖానల సూపరింటెండెంట్‌లు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. గాంధీవైద్యశాలలో 50 శాతం మంది వారం రోజులపాటు మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ మిగతా 50 శాతం మంది క్వారంటైన్‌లో ఉండేలా అమలుచేస్తున్న విధానాన్ని ఇతర దవాఖానల్లో అమలయ్యేలా చూడాలని సూచించింది.  

కేంద్ర సర్క్యులర్లు అన్నీ రాష్ర్టానికి అందజేయాలి 

కొవిడ్‌ చికిత్స, ఇతర మార్గదర్శకాలపై కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎమ్మార్‌ ఇచ్చే సర్క్యులర్లు వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి అందేలా చూడాలని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాల అమలుపై ఈ నెల 29 వరకు నివేదిక ఇవ్వాలని తెలిపిన హైకో ర్టు.. కేసుల విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. 

రాష్ట్రంలో 79 మంది వైద్యసిబ్బందికి కరోనా

 రాష్ట్రంలో 79 మంది వైద్యులు, వైద్యసిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు హైకోర్టుకు వెల్లడించారు. గాంధీలో ఇప్పటివరకు 3,558 మంది కొవిడ్‌-19 రోగులు చేరగా.. 2,288 మంది డిశ్చార్జి అయ్యారని దవాఖాన సూపరింటెండెం ట్‌ రాజారావు తెలిపారు. కొన్ని సివియర్‌ ఆక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ (సార్స్‌) కేసులను ఉస్మానియా, చెస్ట్‌ దవాఖానలకు పంపించామని పేర్కొన్నారు. గాంధీ దవాఖానపై ఒత్తిడి లేదని దాదాపు వెయ్యి పడకలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఐదుగురికి ప్లాస్మాథెరపీ చేయగా విజయవంతమైందని, ఒక్కరికి వైరల్‌ డ్రగ్‌ట్రీట్‌మెంట్‌ చేస్తే విజయవంతమైందని తెలిపారు.  


logo