ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 02:59:59

త్వరలో కొవాగ్జిన్‌ మూడోదశ ట్రయల్స్‌

త్వరలో కొవాగ్జిన్‌ మూడోదశ ట్రయల్స్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌ మూడోదశ మానవ ప్రయోగాలు నవంబర్‌లో ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఆ సంస్థ ఏర్పాట్లుచేస్తున్నట్టు సమాచారం. ఫేజ్‌-1, ఫేజ్‌-2లో ఫలితాలు సంతృప్తికరంగా రావడంతో ఫేజ్‌-3 ప్రయోగాలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) సానుకూలంగా ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మూడోదశలో 28,500 మంది వలంటీర్లపై కొవాగ్జిన్‌ను ప్రయోగించేందుకు భారత్‌ బయోటెక్‌ సిద్ధమవుతున్నది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 19 నగరాల్లో ప్రయోగాలు చేపట్టనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో నిమ్స్‌తోపాటు ఈఎస్‌ఐ దవాఖానలోనూ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఎలాంటి దుష్ప్రభావాలు లేకపోవడం, వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తుండటంతో మూడోదశకు సిద్ధమవుతున్నారు. ఈ దశలో ఎక్కువమందిపై వ్యాక్సిన్‌ ప్రయోగించాల్సి రావడంతో ఈఎస్‌ఐ దవాఖానను కూడా ఎంపికచేసినట్టు తెలిసింది. ఫేజ్‌-2 ట్రయల్స్‌ పూర్తి నివేదికను భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే డీసీజీఐ, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ (ఎస్‌ఈసీ)కి పంపించగా, నిపుణులు వాటిని విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్టు తేలడంతో మూడోదశకు ఏర్పాట్లుచేసుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో ఫేజ్‌-3 అత్యంత కీలక దశ. వేల మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తారు. అనేక కోణాల్లో విస్తృతంగా విశ్షేషిస్తారు. ఈ దశ దాటితే వ్యాక్సిన్‌కు అన్నిరకాల అనుమతులు లభిస్తాయి. వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మూడోదశ ప్రయోగాలు మూడు నెలలపాటు కొనసాగనున్నట్టు తెలిసింది. 


logo