బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 14:42:48

కరోనాకు ధైర్యమే మందు : ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

కరోనాకు ధైర్యమే మందు : ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌ : కరోనాకు ధైర్యమే మొదటి మందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హోలిస్టిక్‌ హాస్పిటల్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కొవిడ్‌ రోగులకు చికిత్సలందించేందుకు ప్రభుత్వానికి ఉచితంగా వంద ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందించింది. కార్యక్రమానికి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, చర్యలు తీసుకుంటుందన్నారు. దవాఖానలో బెడ్లతో పాటు అవసరమైన ఆక్సీజన్‌ అందుబాటులో ఉంచామన్నారు.

ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా విలవిలలాడుతామో మరోసారి ఈ తరం చవిచూసిందన్నారు. ప్రకృతిని నమ్ముకొని, అల్లుకొని కోటానుకోట్ల జీవులు జీవిస్తున్నాయని, దానికి విరుద్ధంగా వెళ్లేది ఒకే జీవి మనిషి అన్నారు. అందుకే ఆ మనిషిని జాగ్రత్తగా ఉండమని కరోనా హెచ్చరిక చేసినట్లుగా భావిస్తున్నానన్నారు. చరిత్రలో కరోనా కంటే ఎక్కువ మరణాల రేటు ఉన్న వైరస్‌లు వచ్చాయని తెలిపారు. కానీ వాటికి గురించి ఎక్కువ చర్చ జరుగలేదన్నారు. సార్స్‌ వంద మందికి సోకితే ఎక్కువ మొత్తంలో చనిపోయే అవకాశం ఉందని, మెర్స్‌ (మిడిల్‌ ఈస్ట్‌ రెస్పెటరీ సిండ్రోమ్‌), ఎబోలా సోకితే కరోనా కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు.

కరోనా వైరస్‌ ప్రబలిన తొలినాళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ జరిగిందని.. పది రోజుల్లో వెయ్యి పడకల హాస్పిటల్‌ నిర్మించే టెక్నాలజీ, కమిట్‌మెంట్‌ ఉన్న దేశం చైనా కావడంతో వైరస్‌ను కట్టడి చేసిందన్నారని, 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో వైరస్‌ ప్రబలితే కట్టడి సాధ్యం కాదని, శవాలు గుట్టలే ఉంటాయన్నారని గుర్తు చేశారు. దేశంలో ప్రస్తుతం మరణాల రేటు తక్కువగా, ఉందని ఎక్కువ సంఖ్యలో రోగులు కోలుకుంటున్నారన్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో బాధితులను వెలివేయకుండా వారికి మేమున్నామంటూ ధైర్యం ఇవ్వాలని, తద్వారా తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందన్నారు.

గతంలో పలు విషాదకర ఘటనలు జరిగాయని, ప్రస్తుతం రాష్ట్రంలో అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో స్థానికంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తుండడంతో దవాఖానల్లో బెడ్లు ఖాళీగా ఉంటున్నాయన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. అలాగే పోలీసుశాఖతో కరోనా కట్టడిలో కృషి చేస్తుందని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కాన్సన్‌ట్రేటర్లు అందించిన హోలిస్టిక్‌ హాస్పిటల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులను అభినందించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo