బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:06:05

అనంతగిరిలో జంట ఆత్మహత్య

అనంతగిరిలో జంట ఆత్మహత్య

  • 26 రోజుల క్రితం బలవన్మరణం
  • అస్థిపంజరాలుగా మారిన వైనం

వికారాబాద్‌ టౌన్‌: వికారాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగుచూసింది. దాదాపు 26 రోజుల క్రితం ఓ చెట్టుకు ఉరి వేసుకోవడంతో శవాలు కుళ్లిపోయాయి. ఎస్పీ నారాయణ, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లికి చెందిన మహేందర్‌ (30) మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కోట్‌పల్లి మండలంలోని ఇందోల్‌లో పనిచేస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన శివలీల (22)తో పరిచయం ఏర్పడింది. మహేందర్‌, శివలీలకు వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది. 

మహేందర్‌కు ఒక పాప ఉండగా, శివలీలకు పిల్లలు లేరు. అయినప్పటికీ వీరిద్దరూ సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 6న వీరు ఇంటి నుంచి వెళ్లిపోయారు. శివలీల కన్పించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు కోట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో అదేరోజు ఫిర్యాదు చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం గొర్రెల కాపరులు అనంతగిరి అటవీ ప్రాతంలోకి వెళ్లగా ఓ చెట్టుకు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వెంటనే 100కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. 

మృతదేహాలను మహేందర్‌, శివలీలగా గుర్తించారు. దాదాపు 26 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని ఉండటంతో శవాలు కుళ్లిపోయాయి. వీరి ఫోన్లను సెల్‌టవర్‌ ఆధారంగా ట్రాక్‌ చేయగా అనంతగిరిలో సిగ్నల్స్‌ ఆగిపోయాయని తెలిసింది. మృతదేహాల పక్కన ఉన్న బైక్‌ మహేందర్‌దిగా గుర్తించారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి అక్కడే మృతదేహాలను ఖననం చేసినట్టు ఎస్పీ తెలిపారు. పలు కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.


logo