మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 07, 2020 , 21:14:08

దేశాభివృద్ధి ఐఐటీయన్ల చేతుల్లోనే ఉంది

దేశాభివృద్ధి ఐఐటీయన్ల చేతుల్లోనే ఉంది

కంది : దేశాభివృద్ధి ఐఐటీలలో చదువుతున్న విద్యార్థుల చేతుల్లోనే ఉందని హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు.  సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైద్రాబాద్‌లో ఆయన పర్యటించారు. అనంతరం ఆడిటోరియంలో విద్యార్థులతో కలిసి ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అభివృద్ధిలో భాగంగా ఐఐటీ హైద్రాబాద్‌ తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయును కుదుర్చుకోవడం మంచి విషయమన్నారు. ఐఐటీ మండి తరహా నానో టెక్నాలజీలను అభివృద్ధి పర్చేలా ఇక్కడి విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే ఐఐటీ మండి విద్యార్థులు కేన్సర్‌ను అరికట్టగలిగే నానో క్యాప్సుళ్లను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. 

ప్రతి ఒక్కరు భారతీయుడనే ఆలోచనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా ఐఐటీలో విధ్యనభ్యసించిన విద్యార్థులు ఇక్కడి నుంచి బయటికి వచ్చేటప్పుడు జాబ్‌ గివర్స్‌గా బయటకి రావాలన్నారు. ఇంకొకరికి ఉద్యోగం అడగకుండా, వారో స్వయంగా ఇతరులకు ఉద్యోగాలు కల్పించేలా స్టార్‌అప్‌లను ప్రోత్సహించాలన్నారు. 2030 నాటికి భారత దేశంలో 65 శాతం యువత పెరిగి యంగ్‌ ఇండియాన్‌ మారబోతుందన్నారు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలు చేసుకుని ఇంటి వారికి బాధను మిగల్చకుండా ధైర్యంగా ముందుకు సాగాలని విద్యార్థులలో ధైర్యాన్ని నింపారు. త్యాగ గుణం, సేవా గుణాన్ని అలవర్చుకుని ఇతరులకు ఆదర్శంగా, దేశాన్ని అభివృద్ధి పర్చడంలో పాత్రులుగా ముందుకు సాగి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రం జడ్పీ హాల్‌లో నిర్వహించిన పౌరసన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైద్రాబాద్‌ డైరెక్టర్‌ బీ.ఎస్‌.మూర్తి, ఐఐటీ విద్యార్థులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.logo
>>>>>>