బుధవారం 03 జూన్ 2020
Telangana - May 21, 2020 , 00:53:20

15 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి

15 లక్షల ఎకరాల్లో అదనంగా పత్తి

  • మక్కజొన్న స్థానంలో పత్తి పంట విస్తీర్ణం పెంపు
  • కంది, పప్పు, నూనెగింజల పంటలకు ప్రోత్సాహం 
  • పంటల సాగుపై జీఐఎస్‌ మ్యాపింగ్‌ సిద్ధం
  • నేడు సీఎం కే చంద్రశేఖర్‌రావుకు అందజేత 

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: నియంత్రిత పంటల సాగువిధానంపై వ్యవసాయశాఖ రాష్ట్ర స్థాయి డ్రాఫ్ట్‌ పంటల మ్యాపింగ్‌ను రూపొందిం చింది. రాష్ట్రవ్యాప్తంగా గతంలో వానకాలం సీజన్‌లో సాగుచేసిన మక్కజొన్న స్థానంలో పత్తి, కంది, నూనెగింజలు, పప్పుధాన్యాల సాగును పెంచేలా సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించింది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. వరి 40.02 లక్షల ఎకరాల్లో, పత్తి 64.75 నుంచి 70 లక్షల ఎకరాల్లో, కందులు 14.09 లక్షల ఎకరాల్లో సాగుచేసేలా ప్రణాళికలు సిద్ధంచేసింది. గత వానకాలంలో 41.19 లక్షల ఎకరాల్లో వరి వేయగా.. ఈసారి 40.02 లక్షల ఎకరాలకు పరిమితం చేశారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో వరిసాగును తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

పత్తి సాగును పెంచాలి

ఈసారి పత్తిని 15 లక్షల ఎకరాల్లో అధికంగా సాగుచేయించాలని భావిస్తున్నారు. గతేడాది 54.45 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. ఈసారి 70 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. మెదక్‌, నారాయణపేట, యాదాద్రిభువనగిరి జిల్లాలు మినహా మిగతా జిల్లాలో పత్తి సాగు ను పెంచేలా ప్రణాళికలు సిద్ధంచేశారు.ప్రధానంగా నల్లగొండలో 7.25 లక్ష లు, నాగర్‌కర్నూల్‌ 4.5 లక్షలు, అదిలాబాద్‌లో 4.35 లక్షల ఎకరాల్లో సాగు కు మ్యాపింగ్‌ చేశారు. 

సోయాబీన్‌ తగ్గింపు

సోయాబీన్‌ సాగును ఈ వానకాలంలో తగ్గించాలని మ్యాపింగ్‌లో పేర్కొన్నారు. గతేడాది 4.26 లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయగా, ఈసారి 2.46 లక్షల ఎకరాలకు తగ్గించాలని ప్రతిపాదించారు. ప్రధానంగా నిర్మల్‌లో 60 వేల ఎకరాలు, కామారెడ్డిలో 50వేల ఎకరాలు, సంగారెడ్డిలో 46వేల ఎకరాల్లో సోయా సాగుకు మ్యాపింగ్‌ చేసినట్లు సమాచారం. 

కందికి అధిక ప్రోత్సాహం

ఈసారి కందిసాగును అధికంగా ప్రోత్సహించాలని నిర్ణయించారు. కంది పంట మొత్తాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. గతేడాది సాగుతో పోలిస్తే దాదా పు అన్ని జిల్లాల్లో కంది సాగును పెంచనున్నారు. గత వానకాలంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయగా, ఈసారి అదనంగా 6.70 లక్షల ఎకరాలతో మొత్తం 14.09 లక్షల ఎకరాల్లో సాగుకు మ్యాపింగ్‌ సిద్ధంగా చేశారు. ఇందు లో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో 1.73 లక్షల ఎకరాలు, నారాయణపేటలో 1.70 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో లక్ష ఎకరాల్లో కందిసాగు చేయాలని ప్రతిపాదించారు.

జొన్న, మినుములు, ఆముదం సాగు పెంపు

జొన్నలు, మినుములు, ఆముదం సాగు పెంచాలని మ్యాపింగ్‌లో ప్రస్తావించారు. ఈ వానకాలంలో జొన్నలు 1.42 లక్షల ఎకరాలు, మినుములు 65,980 ఎకరాలు, ఆముదం 1.39 ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. చెరకును ఈసారి 69,855 ఎకరాల్లో వేసేలా ప్రణాళిక రూపొందించారు. వేరుశనగ 49,960 ఎకరాల్లో సాగుచేయాలని మ్యాపింగ్‌ చేశారు. అదేవిధంగా సీజన్లతో సంబంధంలేకుండా సబ్సిడీపై పచ్చిరొట్ట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. వానకాలంలో మక్కజొన్నలకు ఇచ్చే సబ్సిడీని పచ్చరొట్ట విత్తనాలకు మళ్లించాలని నివేదికలో పేర్కొన్నారు. 


logo