శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 00:47:29

50 లక్షల ఎకరాలు దాటిన పత్తి సాగు

50 లక్షల ఎకరాలు దాటిన పత్తి సాగు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సాగు జోరు కొనసాగుతున్నది. రికార్డు స్థాయిలో ప్రతివారం 10 లక్షల ఎకరాలకుపైగా సాగవుతున్నది. బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 72.78 లక్షల ఎకరాల్లో సాగు పూర్తయినట్టు వ్యవసాయశాఖ తెలిపింది. గత ఏడాది ఇప్పటి వరకు కేవలం 46.61 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. కానీ ఈ సీజన్‌లో అదనంగా 30లక్షల ఎకరాలు సాగవడం విశేషం. నియంత్రిత వ్యవసాయ విధానం ప్రకారమే సాగు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో పత్తిసాగు జోరుగా సాగుతున్నది. ఇప్పటి వరకు రైతులు 50.41 లక్షల ఎకరాల్లో పంట వేశారు. మరో 10లక్షల సాగు పూర్తయితే ఈ సీజన్‌ టార్గెట్‌ పూర్తవుతుంది. తాజా గణాంకాలను బట్టి లక్ష్యం సులభంగానే పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కందుల విస్తీర్ణం కూడా భారీగానే పెరుగుతున్నది. ఇప్పటి వరకు 7 లక్షల ఎకరాల్లో కందిసాగు పూర్తయింది. క్రమంగా వానాలు పెరుగుతుండటంతో వరిసాగు కూడా పెరుగుతున్నది. ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లో వరిసాగు పూర్తయింది.

ఎఫ్‌పీవోలు, ప్రోత్సాహక కమిటీల ఏర్పాటు

రాష్ట్రంలో ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్లు(ఎఫ్‌పీవో), ప్రోత్సాహక కమిటీలను ఏర్పాటుచేస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రస్థాయి కమిటీకి వ్యవసాయ శాఖ కార్యదర్శి చైర్మన్‌గా, జిల్లా స్థాయి కమిటీకి కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటారు.logo