బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:20:34

పత్తి-కంది జుగల్‌బందీ

పత్తి-కంది జుగల్‌బందీ

  • భారీగా పెరిగిన సాగు.. నియంత్రితానికే రైతన్న నిబద్ధత
  • రాష్ట్రంలో లక్ష్యానికి చేరువైన పత్తిసాగు 
  • లాభాలిచ్చే పప్పులకే రైతుల ప్రాధాన్యం
  • మక్కజొన్న జోలికి వెళ్లని అన్నదాతలు
  • 117% పత్తి.. 102% కందిసాగు పూర్తి
  • రాష్ట్రంలో ఊపందుకుంటున్న వరినాట్లు
  • ఇప్పటికే 79 లక్షల ఎకరాల్లో సాగు పూర్తి 
  • గతేడాదికన్నా 21 లక్షల ఎకరాలు అదనం
  • సగం జిల్లాల్లో 80 శాతానికిపైగా పూర్తి
  • ముమ్మరంగా వ్యవసాయపనులు

రాష్ట్రంలో వానకాలం సాగు జోరందుకున్నది. నియంత్రిత పంటల విధానానికే రైతన్న నిబద్ధత చాటుతున్నాడు. ప్రభుత్వం సూచించిన మేరకే ‘సాగు’తున్నాడు. పత్తి సాగు పరుగులు పెడుతున్నది.. కంది సాధారణ విస్తీర్ణాన్ని దాటిపోయింది. పప్పు పంటలూ అదే రీతిలో ఉన్నాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోల్చితే 117 శాతం పత్తి, 102 శాతం కంది అధికంగా సాగయ్యాయి. వీటికితోడు వరి నాట్లు కూడా ఊపందుకున్నాయి. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే 21 లక్షల ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా 76 శాతం సాగు పూర్తికాగా.. సగానికిపైగా జిల్లాల్లో 80 శాతం పూర్తయింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటను సాగుచేయడం ద్వారా రైతులను లాభాల బాట పట్టించవచ్చని భావించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం పేర్కొన్న మేరకు పంటలను సాగుచేయాలని సూచించింది. రైతులు ఈ విధానాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. నియంత్రిత విధానంలో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిన పత్తి, పప్పుధాన్యాల సాగును రైతులు పరుగులు పెట్టిస్తున్నారు. సాధారణ విస్తీర్ణాన్ని మించి ఈ పంటలు సాగవుతున్నాయి. ఇప్పటికే సాధారణ సాగుకంటే పత్తి 117 శాతం, కంది 102 శాతం అధికంగా వేశారు. ప్రభుత్వం సాగు చేయవద్దని చెప్పిన మొక్కజొన్న జోలికి రైతన్న ఎవరూ వెళ్లడం లేదు. పత్తిసాధారణ సాగు విస్తీర్ణం 44,50,029 ఎకరాలు కాగా, ఇప్పటికే 52,10,614 ఎకరాల్లో విత్తనాలు వేశారు. మరో ఎనిమిది లక్షల ఎకరాల్లో విత్తనాలు వేస్తే ప్రభుత్వం సూచించిన 60.16 లక్షల ఎకరాల్లో పత్తి సాగు పూర్తవుతుంది. 

గతేడాది ఇదే సమయానికి 34,58,635 ఎకరాల్లో మాత్రమే పత్తిని వేశారు. అలాగే కంది సాధారణ సాగువిస్తీర్ణం 7,61,212 ఎకరాలకుగాను 7,78,148 ఎకరాల్లో సాగయింది. గతేడాది ఇది 4,95,505 ఎకరాలు మాత్రమే. పత్తిసాగులో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉన్నది. ఈ జిల్లాలో ఏకంగా 6.01 లక్షల ఎకరాల్లో పత్తివేయడం గమనార్హం. తర్వాత నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 4.08 లక్షల ఎకరాల్లో, ఆదిలాబాద్‌ లో 3.89 లక్షల ఎకరాలు, ఆసిఫాబాద్‌లో 3.28 లక్షలు, రంగారెడ్డిలో 2.21 లక్షలు, వికారాబాద్‌లో 2.07 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. వరిపాట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. వరి సాధారణ సాగు విస్తీర్ణం 27,25,058 ఎకరాలు కాగా, ఇప్పటికే 10,20,698 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. గతేడాది ఈ సమయానికి వరి 4,04,320 ఎకరాల్లో మాత్రమే సాగయింది. మక్కజొన్న సాగు పట్ల రైతులు కూడా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ అనుమతితో పౌల్ట్రీ, డెయిరీ రైతులు మాత్రం 1.49 లక్షల ఎకరాల్లో మక్కలు సాగు చేశారు. 

రికార్డుస్థాయి సాగు

తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన నీటి వసతులకు వాతావరణం కూడా అనుకూలిస్తుండటంతో రికార్డుస్థాయిలో పంటలు సాగవుతున్నాయి. ఇప్పటికే ఏకంగా 79 లక్షల ఎకరాల్లో పంటలు వేయడం పూర్తయింది. గతేడాదితో పోల్చితే ఇది 21 లక్షల ఎకరాలు అదనం. గత వానకాలం సీజన్‌లో ఈ సమయానికి 58.17 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. ఈ ఏడాది 79.05 లక్షల ఎకరాల్లో పూర్తయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 76 శాతం సాగు పూర్తయినట్టు వ్యవసాయశాఖ పేర్కొన్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం వానకాలం సాగు విస్తీర్ణం 1.25 కోట్ల ఎకరాలు కాగా, వ్యవసాయశాఖ మాత్రం సాధారణ సాగువిస్తీర్ణాన్ని 1.03 కోట్ల ఎకరాలుగా అంచనావేసింది. ఈ ఏడాది వాతావరణం అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం ప్రభుత్వ అంచనాలను మించిపోవచ్చని వ్యవసాయనిపుణులు పేర్కొంటున్నారు.


టాప్‌లో ఆసిఫాబాద్‌.. 

చివర్లో వనపర్తి 

రాష్ట్రంలో పంటల సాగులో 117 శాతం సాగుతో ఆసిఫాబాద్‌ జిల్లా మొదటిస్థానంలో నిలువగా.. 24 శాతం సాగుతో వనపర్తి చివరన నిలిచింది. 15 జిల్లాల్లో 80 శాతానికిపైగా సాగు పూర్తయింది. 6 జిల్లాల్లో మాత్రమే 50 శాతానికి తక్కువగా పంట సాగయింది. ఆదిలాబాద్‌లో 111, నారాయణపేట్‌ జిల్లాలో 107, సంగారెడ్డిలో 96, కామారెడ్డిలో 92, మెదక్‌లో 90శాతం పంటలు సాగయ్యాయి.

విస్తారంగా వర్షాలు

రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సాధారణంకంటే 29 శాతం అధిక వర్ష్షపాతం నమోదయింది. ఈ నెల 22వ తేదీ వరకు 292.4 మిల్లీమీటర్ల సాధారణ వర్ష్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 377.2 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్‌లో సాధారణకంటే 34 శాతం అధికకంగా వర్ష్షపాతం నమోదైంది. 22 జిల్లాల్లో సాధారణ వర్ష్షపాతం కంటే 20 శాతం ఎక్కువగా, 10 జిల్లాలో సాధారణ వర్ష్షపాతం కురిసింది. ఒక్క నిర్మల్‌లో మాత్రమే సాధారణం కంటే తక్కువ కురిసింది.

ఆహారపంటల దిగుబడి 

3.32 కోట్ల టన్నులు

అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలంగాణ రాష్ట్రం మరోసారి యావత్‌ దేశానికి తిండిపెట్టేస్థాయికి ఎదుగనున్నది. ఇప్పటికే యాసంగిలో దేశంలో మరే రాష్ర్టానికి సాధ్యంకాని విధంగా రికార్డుస్థాయిలో వరి ధాన్యం పండించింది. ఈసారి కూడా రాష్ట్రం అన్నపూర్ణగా వెలుగొందనున్నదని, యావత్‌ భారతావనికి అన్నం పెట్టనున్నదని స్పష్టమవుతున్నది. వానకాలం, యాసంగిలో కలిపి రాష్ట్రంలో 1.08కోట్ల ఎకరాల్లో ఆహారపంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనావేసింది. దీనిద్వారా దాదాపు 2.88కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నది. ఇందులో వరిధాన్యం దిగుబడి 2.54 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

పడావు భూముల్లోనూ పంటలు

కండ్లముందు నీళ్లు, ఖాతాల్లో రైతుబంధు పైసలు పడటంతో రైతులు పడావుభూములనూ సాగులోకి తీసుకువస్తున్నారు. ఒక్క గుంట భూమిని కూడా బీడుగా వదలకుండా అచ్చుకడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలకలు సాగుభూములుగా మారాయి. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 6-8 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అధికారులు అంచనావేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పట్నంనుంచి పల్లెబాట పట్టిన యువత పడావుపడిన భూములను కూడా సాగుకు అనుకూలంగా మార్చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఓ రైతు తనకున్న 15 ఎకరాలతోపాటు ఇతరులది కలిపి మొత్తం 80 ఎకరాల వరకు సాగు చేస్తుండటం విశేషం. 

పప్పుతో లాభాల కుప్పలే..

పప్పుధాన్యాల సాగు వరిని మించి గిట్టుబాటు అవుతున్నది. ఎకరంలో వరిసాగుకు రూ.22,447 ఖర్చయితే 28క్వింటాళ్ల దిగుబడికి రూ.1,868 మద్దతు ధర చొప్పున రూ.52,304 ఆదాయం వస్తున్నది. ఖర్చు తీసేస్తే మిగిలేది 29,857. అంటే రూపాయి పెట్టుబడికి వచ్చేది రూ.2.33 మాత్రమే. అదే ఎకరంలో కందులు పండించేందుకు రూ.16,532 ఖర్చయితే 8క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రూ.ఆరు వేలమద్దతు ధర చొప్పున ఆదాయం రూ.48 వేలు వస్తున్నది. ఖర్చు తీసేస్తే రూ.31,468 మిగులుతాయి. దీంతో రూపాయి పెట్టుబడికి వచ్చేది రూ.2.90. పెసర్లకు రూ.4.47, మినుములకు రూ.3.48 వస్తాయి.

నియంత్రిత సాగు లక్ష్యాన్ని సాధిస్తాం

నియంత్రిత సాగు విధానంలో భాగంగా జిల్లాలో పత్తి పంటను ప్రోత్సహించాం. రైతులు కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ పత్తిసాగుకు ముందుకొచ్చారు. ఈ సీజన్‌లో ఇప్పటికే 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. ఈ వారంలో వందశాతం లక్ష్యాన్ని సాధిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు డబ్బులు, సమృద్ధిగా ఎరువులు అందుబాటులో ఉండడంతో రైతులు కూడా ఉత్సాహంగా సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. గత సీజన్‌లో పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడంతో రైతుల్లో మరింత విశ్వాసం పెరిగింది. 

- జీ శ్రీధర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా వ్యవసాయాధికారి

పత్తి సాగులో ఇబ్బందుల్లేవు

నాకున్న నాలుగెకరాల్లో రెండెకరాల్లో పత్తి ఏసిన. ఇంకో రెండెకరాల్లో తిండిగింజల కోసం వరినాటు పెడుతున్నా. ఈసారి కేసీఆర్‌ సార్‌ ముందే రైతుబంధు డబ్బులు ఇచ్చిండు. ఎరువులు కూడా దొరుకుతున్నయి. దేవుని దయ వల్ల మంచి వానలొస్తున్నాయి. పత్తి చేను కూడా బాగా పెరుగుతున్నది. పోయిన ఏట పత్తి బాగా పండింది. సర్కార్‌ చెప్పిన చోటనే అమ్మినా. మంచి రేటు కూడా వచ్చింది. పైసలు కూడా వెంటనే బ్యాంకులో జమైనయి. ఈ సారి కూడా పత్తి పెట్టమని వూళ్లో అధికారులు చెప్పారు. ఈసారి కూడా బానే పైసలు రావాలనుకుంటున్న.

- యాదగిరి, రైతు, పానగల్‌, నల్లగొండ జిల్లా

సాగుకోసం మడ్లు అచ్చుకట్టిన

నాకు ఆరెకరాల భూమి ఉన్నది. ప్రతిసారి మూడెకరాలు సాగుచేస్తూ మరో మూడెకరాలు పడావు పెట్టేటోన్ని. కానీ, ఈ వానకాలంలో ఆ మూడెకరాలను కూడా సాగుచేస్తున్న. ఇన్నేండ్లు లీళ్లు లేక పడావు పెట్టిన.. ఇప్పుడు లీళ్లు మస్తుగున్నయ్‌. అందుకే ఎంత కర్సయినా సరేనని మడ్లు అచ్చుకట్టిచ్చినా. ఆరెకరాల్లో ఎవుసం చేస్తున్న.

-లక్ష్మయ్య, రైతు, సిద్దిపేట జిల్లా


logo