బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:40:57

ఖమ్మంలో కార్పొరేటర్‌ కారుకు నిప్పు

ఖమ్మంలో కార్పొరేటర్‌ కారుకు నిప్పు

రఘునాథపాలెం: ఓ కార్పొరేటర్‌ కారుకు కొందరు వ్యక్తులు నిప్పంటించారు. ఇటీవల మృతి చెందిన ఓ యువకుడి కేసు విషయంలో దాడులు, ప్రతి దాడులకు దిగడంతో మంగళవారం ఖమ్మం నగరంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరంలోని కైకొండాయిగూడెం ప్రాంతానికి చెందిన తేజావత్‌ ఆనంద్‌(23) గత నెల 18న ఓ కార్పొరేటర్‌కు చెందిన ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లాడు. అక్కడ వెల్డింగ్‌ పనులు చేస్తున్న క్రమంలో ఆనంద్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆనంద్‌ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు అదేరోజు ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం కైకొండాయి గూడెంలోని ఓ పాఠశాలలో ఆన్‌లైన్‌ క్లాసుల ప్రారంభోత్సవానికి సదరు కార్పొరేటర్‌ రాగా ఆనంద్‌ బంధువులు నిలదీశారు. కోపోద్రిక్తుడైన కార్పొరేటర్‌ అసభ్య పదజాలంతో వారిని దూషించడమేగాక దాడి చేసినట్లు తెలిసింది. ఆగ్రహానికి గురైన ఆనంద్‌ కుటుంబ సభ్యులు కార్పొరేటర్‌పై దాడికి పాల్పడ్డారు. ప్రాణభయంతో కార్పొరేటర్‌ సమీపంలోగల జెడ్పీ పాఠశాలలోకి వెళ్లి తలదాచుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న ఆయన కారును ధ్వంసం చేసి దహనం చేశారు. సమాచారం అందుకున్న ఖమ్మం అర్బన్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను నిలువరించారు. సుమారు రెండు గంటలపాటు పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆనంద్‌ మృతికి కారణమైన కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఖమ్మం టూటౌన్‌ సీఐ తుమ్మా గోపి.. సదరు కార్పొరేటర్‌ను భారీ బందోబస్తు నడుమ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.


logo