బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 08, 2020 , 15:40:54

రాష్ర్టంలో సెప్టెంబ‌ర్ నాటికి అదుపులో క‌రోనా!

రాష్ర్టంలో సెప్టెంబ‌ర్ నాటికి అదుపులో క‌రోనా!

  • ఆగస్టు నెలఖారుకల్లా జీహెచ్‌ఎంసీలో!
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు
  • కచ్చితంగా చికిత్స విధానం పాటించాలి
  • ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కోసం టెండర్లు పిలిచాం

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్ట‌ర్ జీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆగస్టు నెలఖారుకల్లా జీహెచ్‌ఎంసీలో కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించిందని తెలిపారు. జిల్లాల్లోని ఆస్పత్రులతో పాటు అన్ని వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విలువైన ఇంజెక్షన్లు జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉంచామని చెప్పారు. దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తెచ్చామన్నారు. దాదాపు 18 వేల పడకలకు ఆక్సిజన్‌ అందుబాటులోకి రాబోతుందన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమకూర్చుకునేందుకు టెండర్లు పిలిచామన్నారు. 

కరోనా రోగులు త్వరగా కోలుకునే విధంగా ప్రభుత్వం ధైర్యం కల్పిస్తుందన్నారు. కరోనా నిర్ధారణ అయ్యాక చికిత్స విధానం కచ్చితంగా పాటించాలన్నారు. రోగి పరిస్థితి ఆధారంగా అవసరమైన చికిత్సను వైద్యులు సూచిస్తారు. కరోనా రోగుల్లో అందరికీ ఒకే విధమైన మందులు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌ వస్తే 14 రోజులకు మందుల కిట్‌ అందజేస్తున్నాం. సరైన సమయంలో మందులు వాడితేనే కరోనా తగ్గుతుంది. ఐసోలేషన్‌ సౌకర్యం లేని వారికి కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

కొన్ని కేసుల్లో విషమంగా ఉండి వెంటిలేటర్‌పై ఉంటే ప్లాస్మా ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. ప్లాస్మా దాతల్లో యాంటీబాడీలు అభివృద్ధి చెంది ఉంటేనే ఉపయోగం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు పెరిగింది.. కరోనా మరణాల శాతం తగ్గిందన్నారు. ప్రభుత్వ నివారణ చర్యలతో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. logo