బుధవారం 08 జూలై 2020
Telangana - May 31, 2020 , 01:45:21

గర్భిణులకు కరోనా ముప్పు

గర్భిణులకు కరోనా ముప్పు

  • జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఇటీవల గర్భిణిలకు ఎక్కువగా సోకుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటివరకు 30 మంది గర్భిణిలకు కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చింది. దాంతో గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్‌బారినపడ్డ గర్భిణిల్లో ప్రసవ సమయం రానివారు 14రోజులపాటు వైద్యచికిత్స పొంది ఇండ్లకు వెళ్తున్నారు. ఇప్పటివరకు నెలలు నిండిన నలుగురికి గాంధీ దవాఖానలోని ప్రత్యేక వైద్య బృందం ప్రసవం చేసింది. వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలతో తీసుకోవటంతో తల్లులూ.. వారి పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. గర్భిణిల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్‌ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. తల్లికి వైరస్‌ ఉన్నప్పటికీ పుట్టిన శిశువులకు అది వ్యాపించే అవకాశం చాలా తక్కువేనని, తల్లిపాల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి ఉండదని వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • గర్భిణిలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ నిర్బంధం పాటించడం మంచిది. వారు ఉన్న గదిలో ఇతర కుటుంబసభ్యులు సమూహంగా ఉండకూడదు. 
  • కుటుంబసభ్యులు కాళ్లు, చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు ఉపయోగించడం తప్పనిసరి. 
  • ఇంట్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, ఇతర ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. 
  • జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణం వైద్యులను సంప్రదించాలి. 
  • స్కానింగ్‌, ఇతర అత్యవసర పరిస్థితుల్లోనే దవాఖానలకు వెళ్లాలి. 
  • అనారోగ్య సమస్యలుంటే ఆశాలు, ఏఎన్‌ఎంలు, తరచూ కలిసే గైనకాలజిస్ట్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించాలి 
  • వైద్యపరీక్షల కోసం వెళ్లాల్సి వస్తే మాస్క్‌, గ్లౌజ్‌లు కచ్చితంగా ధరించాలి. శానిటైజర్‌ వెంట తీసుకెళ్లాలి. చేతులు తరుచూ శుభ్రం చేసుకోవాలి. 


logo