శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 00:52:48

మరో 15 మందికి కరోనా పరీక్షలు

మరో 15 మందికి కరోనా పరీక్షలు
  • వీరంతా విదేశాలకు వెళ్లివచ్చినవారే
  • 19 మంది అనుమానితులకు నెగెటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చైనా, దుబాయ్‌ తదితర దేశాలకు వెళ్లివచ్చిన మరో 15 మంది ముందుజాగ్రత చర్యల్లో భాగంగా శుక్రవారం గాంధీ దవాఖానను ఆశ్రయించారు. వీరికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ ద్వారా వెల్లడించింది. వీరికి సంబంధించిన మెడికల్‌ రిపోర్ట్‌ శనివారం వస్తుందని తెలిపింది. గురువారం 20 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, మెడికల్‌ రిపోర్టుల్లో 19 మందికి నెగెటివ్‌ వచ్చిందని, మరోవ్యక్తి రిపోర్టు శనివారం రానున్నదని వివరించింది. ఇప్పటివరకు 232 మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో ఒక్కటి మాత్రమే పాజిటివ్‌ కేసు నమోదు కాగా, 215 మందికి లక్షణాల్లేవని తేలింది. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఇప్పటివరకు 26,530 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయగా, శుక్రవారం 5,233 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేసినట్టు బులెటిన్‌లో పేర్కొన్నది. శుక్రవారం గాంధీ దవాఖానను ఆశ్రయించినవారిలో జగిత్యాల, జనగామ, వరంగల్‌వాసులు ఒక్కొక్కరు ఉన్నారు. ఈ ముగ్గురూ ఇటీవలే విదేశాలకు వెళ్లివచ్చినవారే కావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని ముజీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియా రియాద్‌కు వెళ్లి వచ్చారు. ఇటీవల అతను హైదరాబాద్‌కు రాగా, జ్వరం, జలుబు లక్షణాలు కనిపించాయి. అనుమానంతో శుక్రవారం నల్లకుంటలోని ఫీవర్‌ దవాఖానలో చేరారు. శాంపిళ్లను గాంధీకి పంపించారు.


logo