గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 03, 2020 , 14:27:25

కరోనా వైరస్‌పై అన్ని చర్యలు తీసుకుంటున్నాం : ఈటల

కరోనా వైరస్‌పై అన్ని చర్యలు తీసుకుంటున్నాం : ఈటల

హైదరాబాద్‌ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. గాంధీ మెడికల్‌ కాలేజీ లైబ్రరీ బిల్డింగ్‌ను ప్రారంభించిన మంత్రి ఈటల.. ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గాంధీ మెడికల్‌ కాలేజీలో నేటి నుంచి కరోనా పరీక్షలను వైద్యులు చేస్తారని తెలిపారు. గంటల్లోనే ఫలితాలు వస్తాయన్నారు. కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విజృంభిస్తుందన్నారు. చైనా నుంచి వచ్చే వారిని కేంద్రం స్క్రీనింగ్‌ చేస్తోంది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. తెలుగు రాష్ర్టాల ప్రజలకు ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. ఇక చైనా నుంచి వచ్చిన వ్యక్తులను 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఛాతీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. ఈ మూడు ఆస్పత్రుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. అనుమానిత వ్యక్తుల శాంపిల్స్‌ను పుణెకు పంపించాం.. ఆ రిపోర్టులో కరోనా వైరస్‌ లేదని తేలిందన్నారు. గత పది రోజులుగా శాంపిల్స్‌ను పుణెకు పంపుతున్నాం. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇప్పుడు గాంధీ ఆస్పత్రిలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రారంభించామని తెలిపారు. కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం కిట్‌లను కేంద్రం పంపిణీ చేసిందన్నారు. ల్యాబ్‌లో కిట్స్‌, మ్యాన్‌పవర్‌ అన్ని అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.


logo