సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:53:53

‘కార్పొరేట్‌'ను తలదన్నేలా!

‘కార్పొరేట్‌'ను తలదన్నేలా!

  • ఒక్కో వ్యాధిగ్రస్థునికి 20 మంది సేవలు 
  • కరోనా బాధితులకు సర్కారు దవాఖానల భరోసా
  • కంటికి రెప్పలా కాపాడుతున్న వైద్యసిబ్బంది 
  • గాంధీ, ఫీవర్‌, ఛాతీ దవాఖానల్లో ప్రత్యేక సౌకర్యాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 మహమ్మారిని కట్టడిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టింది. సర్కారు దవాఖానల్లో ప్రభుత్వం దూరదృష్టితో కల్పించిన అధునాతన సౌకర్యాలు ప్రస్తుతం ఎంతో అక్కరకొస్తున్నాయి. వీటి ఆసరాతో కరోనా వైరస్‌ బాధితులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తూ ప్రభుత్వ దవాఖానలు భరోసా కల్పిస్తున్నాయి. ప్రత్యేకించి కరోనా నోడల్‌ కేంద్రాలైన గాంధీ, ఫీవర్‌, ఛాతీ దవాఖానలు కార్పొరేట్‌ వైద్యశాలలకు మించిన వైద్యసేవలందిస్తున్నాయి. ఫలితంగా బాధితులు క్రమంగా కోలుకొని ఇండ్లకు క్షేమంగా తిరిగివెళ్తున్నారు. 

కరోనా నియంత్రణ చికిత్సలో జనరల్‌ మెడిసిన్‌, పల్మనాలజీ, క్రిటికల్‌ కేర్‌ విభాగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఈ విభాగాల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లు, శానిటేషన్‌, సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం కృషిచేస్తున్నారు. కరోనా బాధితుల కోసం గాంధీ దవాఖానలో 40 పడకలతో కూడిన ఐసొలేషన్‌ వార్డును ఏర్పాటుచేశారు. నల్లకుంట ఫీవర్‌ దవాఖానలో 40, ఎర్రగడ్డ ఛాతీ దవాఖానలో 20, ఉస్మానియాలో 10 బెడ్లతో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం గాంధీ ఐసొలేషన్‌ వార్డులో 200 మంది, ఛాతీ, ఫీవర్‌ దవాఖానల్లో దాదాపు 50 మంది చొప్పున వైద్యసిబ్బంది అందుబాటులో ఉన్నారు. ఒక్కో వ్యాధిగ్రస్థునికి 10 నుంచి 20 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు.

అనుమానితులను ఎలా గుర్తిస్తారంటే..

కొవిడ్‌-19 అధికంగా వ్యాప్తిచెందిన దేశాల నుంచి వచ్చేవారితోపాటు జ్వరం, దగ్గు, శ్వాసతీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది లాంటి లక్షణాలున్న వారిని కరోనా అనుమానితులుగా పరిగణిస్తారు. అనుమానితులెవరైనా 104 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు వ్యక్తిగతంగా సమాచారమిస్తే వారు ఉన్నచోటికే వైద్యసిబ్బంది వెళ్తారు. వారికి ప్రత్యేక దుస్తులు, మాస్క్‌లు, చేతులకు, కాళ్లకు తొడుగులు తొడిగి ప్రత్యేక అంబులెన్సులో దవాఖానకు తరలిస్తారు. అక్కడ జనరల్‌ మెడిసిన్‌ విభాగం సిబ్బంది వారి అనారోగ్య సమస్యలను తెలుసుకొని వ్యాధి లక్షణాలను నిర్ధారించుకొంటుంది. ఆ తర్వాత ఆయా వ్యక్తుల వివరాలను నమోదు చేసుకొని ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డుకు తరలిస్తారు. గాంధీ వైద్యకళాశాల రెండో అంతస్తులోని వైరాలజీ ల్యాబ్‌లో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు

చికిత్స సాగేదిలా..

బాధితులకు ఎప్పటికప్పుడు టెంపరేచర్‌ చెక్‌చేయడంతోపాటు ప్రతి రెండు, మూడు గంటలకు ఓసారి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. వ్యాధిగ్రస్తులను జనరల్‌ మెడిసిన్‌ వైద్యనిపుణులతోపాటు పల్మనాలజీ, రేడియాలజీ వి భాగాల నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.  

వైరస్‌ విస్తరించకుండా..

కరోనా వ్యాధిగ్రస్థుల నుంచి వైరస్‌ ఇతరులకు సోకకుండా నిరోధించేందుకు వేలమంది సిబ్బం ది 24 గంటలూ పనిచేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌ రిపోర్టు రాగానే బాధితుడు ఎవరు? అతడిది ఏ ఊరు? ఎవరెవరిని కలిశాడు? తదితర వివరాలను గంటల్లోనే రాబడుతున్నారు. ఫోన్లు కలవకపోతే నేరుగా ఇంటికే వెళ్లి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారిని దవాఖాన్లకు తరలించడం, లేదంటే ఇంట్లోనే క్వారంటైన్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్నది.

ఐసొలేషన్‌ వార్డులో నాలుగు విభాగాలు

గాంధీ దవాఖానలోని ఐసొలేషన్‌ వార్డును నాలుగు విభాగాలుగా విభజించి.. అనుమానిత లక్షణాలున్నవారిని మొదటి విభాగంలో, వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని రెండో విభాగంలో, కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయిన వారిని మూడో విభాగంలో, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారిని నాలుగో విభాగంలో ఉంచుతున్నారు. అనుమానిత లక్షణాలున్నవారిని, కొవిడ్‌-19 నిర్ధారణ అయినవారిని ఒక్కో ప్రత్యేక గదిలో ఉంచి వైద్యసేవలందిస్తారు. ఐసొలేషన్‌లో ఉంచినవారికి జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఇబ్బందులను తగ్గించేందుకు చికిత్స అందిస్తారు. అనుమానితులతోపాటు పాజిటివ్‌ వ్యక్తులకు గాంధీ దవాఖానలోని డైట్‌ క్యాంటిన్‌ నుంచి ప్రత్యేకంగా ప్యాక్‌చేసిన ఆహారాన్ని, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ను మూడుపూటలా అందిస్తున్నారు. 

ఒంటరితనానికి వైఫైతో చెక్‌

ఐసొలేషన్‌ గదుల్లో ఒంటరిగా ఉండేందుకు ఇబ్బందిపడుతున్న బాధితులకు సెల్‌ఫోన్లు వాడుకొనే వీలు కల్పించడంతోపాటు వైఫై సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేశారు. కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు వచ్చినవారిని కొద్దిరోజులు ఐసొలేషన్‌లో ఉంచి డిశ్చార్జ్‌ చేస్తారు. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన వ్యక్తులను మాత్రం పూర్తిగా కోలుకునేవరకు దవాఖానలోనే ఉంచుతారు. నెగెటివ్‌ రిపోర్టు వచ్చిన తర్వాతే వారిని డిశ్చార్జ్‌ చేస్తారు.


logo