సోమవారం 06 జూలై 2020
Telangana - May 29, 2020 , 01:38:28

రాష్ట్రంలో అదుపులోనే కరోనా

రాష్ట్రంలో అదుపులోనే కరోనా

  • సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కరోనా వైరస్‌ నియంత్రణలోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గౌబాకు తెలిపారు.  కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొవిడ్‌-19 నివారణకు ప్రజారోగ్య స్పందనపై అన్ని రాష్ర్టాల సీఎస్‌లు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శులతో రాజీవ్‌గౌబా గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లోని కంటైన్మెంట్‌ జోన్లలో కేంద్ర మార్గదర్శకాలను అమలుచేస్తున్నట్టు వివరించారు.  రాష్ట్రంలో వైరస్‌ నియంత్రణలోనే ఉందని, సరిపడా పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లు, టెస్టింగ్‌ కిట్లు, బెడ్లు, వెంటిలేటర్లు సమకూర్చుకున్నామని చెప్పారు. 

కొవిడ్‌-19 చికిత్సకు ప్రత్యేక దవాఖానలు ఏర్పాటుచేశామని, అధికంగా కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో సీఎస్‌తోపాటు హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, సీసీఎల్‌ఏ డైరెక్టర్‌ రజత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉన్న ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌, థానె, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా, ఇండోర్‌, జైపూర్‌, జోధ్‌పూర్‌, చెంగల్‌పట్టు, తిరువళ్లూర్‌ నగరాల మున్సిపల్‌ కమిషర్లు, కలెక్టర్లతో రాజీవ్‌గౌబా సమీక్ష నిర్వహించారు. 


logo