శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 02:48:36

కరోనా కంట్రోల్‌ రూం

కరోనా కంట్రోల్‌ రూం
  • గాంధీ హాస్పిటల్‌కు కిట్లు.. నేటినుంచి నిర్ధారణ పరీక్షలు
  • ట్రయల్స్‌ చేపట్టిన వైరాలజీ నిపుణులు
  • అనుమానిత కేసులలో 9 మందికి వ్యాధి లక్షణాల్లేవు
  • ఫీవర్‌ దవాఖానకు నాలుగు అనుమానిత కేసులు
  • ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉన్నది: మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/సిటీబ్యూరో/ బన్సీలాల్‌పేట్‌/ సుల్తాన్‌బజార్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్‌ కట్టడికి ముందస్తు చర్యలు ప్రారంభించింది. అందులోభాగంగా తక్షణ సహా యం అందించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానలో కరోనా పరీక్షల కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా అనుమానిత కేసులుగా గుర్తించినవారిలో తొమ్మిది మందికి వ్యాధి లక్షణాలు లేవని పుణె నివేదికల ద్వారా తేలింది. మరో ఇద్దరి నిర్ధారణ పరీక్షలకు సంబంధించి నివేదికలు రావాల్సి ఉన్నది. కరోనా వైరస్‌ లక్షణాలతో ఫీవర్‌ దవాఖానలో నాలుగు అనుమానిత కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌కు సంబంధించి సమాచారం అం దించేందుకు 24 గంటలపాటు పనిచేసేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటుచేశారు. ఎవరైనా తమకు వ్యాధి లక్షణాలు కనిపించినట్టు అనుమానం రాగానే కంట్రోల్‌రూంలోని 040-24651119 ఫోన్‌నంబర్‌లో సంప్రదించి తగిన సహాయం పొందాలని వైద్య విభాగాలు సూచిస్తున్నాయి. 


ఇక్కడే పరీక్షలకు అవకాశం

కరోనా వైరస్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్లు హైదరాబాద్‌కు చేరుకొన్నాయి. ఇప్పటివరకు అనుమానిత రోగుల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం పుణెలోని ల్యాబ్‌కు పంపేవారు. కేంద్ర ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షల కిట్లను గాంధీ దవాఖానకు పంపడంతో ఇకపై ఇక్కడే ప్రాథమిక పరీక్షలు నిర్వహించేందుకు వెసులుబాటు కలిగింది. గాంధీలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగలిగితే అనుమానిత కేసుల ప్రాథమిక పరీక్షలు చేసి కేసు తీవ్రతను గుర్తించవచ్చు. ఈ రిపోర్టులను తిరిగి కేంద్ర వైద్యబృందానికి పంపనున్నారు. శుక్రవారం ట్రయల్‌ పరీక్షలు జరిపినట్టు గాంధీ మెడికల్‌ కళాశాల వైస్‌ప్రిన్సిపాల్‌, వైరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ నాగమణి తెలిపారు. కేంద్రానికి పంపిన ట్రయల్స్‌ నివేదికలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) వైద్య బృందం పరిశీలించి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతనే పూర్తిస్థాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. కేరళలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదుకావడంతో.. చైనా నుంచి తెలంగాణలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి నిర్ధారణ పరీక్షలు చేపట్టనున్నారు. 


వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనా వైరస్‌ బారి నుంచి కాపాడుకోవచ్చని రాష్ట్ర వైద్యాధికారులు చెప్తున్నారు. కరోనా వైరస్‌ స్పర్శ, గాలి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా వైరస్‌ సోకిన వ్యక్తికి సాధారణ జలుబు లక్షణాలే ఉంటాయని, తీవ్రమైన జ్వరంతోపాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందని వైద్యులు తెలిపారు. ముక్కు నుంచి తీవ్రంగా ద్రవాలు కారడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు సమూహాల మధ్యకు వెళ్లకపోవడం మంచిదని, టిష్యూ, కర్చీఫ్‌ వంటివి ఉపయోగించాలని, ఇంట్లోనే ఉండి ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.


ఫీవర్‌ దవాఖానకు నాలుగు అనుమానిత కేసులు

హైదరాబాద్‌ నగరంలో మరో నాలుగు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. నలుగురు అనుమానిత వ్యక్తులు శుక్రవారం ఫీవర్‌ దవాఖానలో చేరగా వారిలో ఇద్దరు.. వైద్యుల సలహాకు విరుద్ధంగా డిశ్చార్జ్‌ (లామా) అయి వెళ్లిపోయారని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. మరో ఇద్దరు ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, వీరి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉన్నదని చెప్పారు. జలుబుతో కూడిన జ్వరం ఉండటంతో ముందుజాగ్రత్తగా దవాఖానకు వచ్చారని పేర్కొన్నారు. కాగా మూడు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్టు ఫీవర్‌ దవాఖాన వైద్యులు తెలిపారు.


వైరాలజీ ల్యాబ్‌ సిద్ధం: డాక్టర్‌ శ్రావణ్‌కుమార్‌

కేంద్ర కుటుంబసంక్షేమశాఖ మార్గదర్శకాల మేరకు ‘కరోనా’ అనుమానిత వ్యక్తుల రక్తనమూనాలను పరీక్షించేందుకు వైరాలజీ ల్యాబ్‌ సిద్ధంగా ఉన్నదని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు ఎవరైనా వస్తే ముందుగా ఏడో అంతస్తులోని వార్డులో చేర్చుకొని పరిశీలనలో పెడతామని, వారం అనంతరం శాంపిల్స్‌ సేకరించి పాజిటివ్‌గా తేలితే నాలుగో అంతస్తులోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తామన్నారు. ప్రత్యేక వార్డులో శిక్షణపొందిన సిబ్బందితోపాటు మానిటర్లు, వెంటిలేటర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు, మూడంచెల మాస్క్‌లు, మందులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. 


త్వరలో ఖాళీల భర్తీ చేపడుతాం

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని, ఈ వైరస్‌పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నా రు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఇక నుంచి హైదరాబాద్‌లోనే జరుగనున్నాయని, ప్రజల అవసరాల కోసం కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటుచేసినట్టు తెలిపారు. శుక్రవారం ఉస్మానియా వైద్య కళాశాలలో నర్సుల దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల విశ్వాసం పెరిగిందని, దీనికి ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్న ప్రసవాలే నిదర్శనమని చెప్పారు. త్వరలో ప్రభుత్వ దవాఖానల్లోని ఖాళీలను విడుతలవారీగా భర్తీచేసి వైద్యులు, నర్సులు, సిబ్బందిపై పనిభారాన్ని తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. 


మానవతా కోణంలో నర్సులు మరింత మెరుగైన సేవలందించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ జేఏసీ చైర్మన్‌ డాక్టర్‌ బీ రమేశ్‌, కన్వీనర్‌ డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, సెక్రటరీ జనరల్‌ బీ వెంకటేశ్వర్‌రెడ్డి, ముఖ్య సలహాదారు జూపల్లి రాజేందర్‌, మహిళా విభాగం నాయకులు హేమలత, రాధిక, సుజాత, కోచైర్మన్లు షబ్బీర్‌ అహ్మద్‌, చంద్రశేఖర్‌ రావు, ఎన్కే ప్రసన్న, ఎండీ ఖలీమొద్దీన్‌, కోకన్వీనర్లు డాక్టర్‌ ఎంకే రవూఫ్‌, ఎంఎస్‌ మూర్తితోపాటు 52 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


logo