బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 20:34:12

పేట్లబుర్జ్‌ ప్రసూతి ఆస్పత్రిలో 30 మందికి కరోనా

పేట్లబుర్జ్‌ ప్రసూతి ఆస్పత్రిలో 30 మందికి కరోనా

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. వైరస్‌ ప్రభావం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. తాజాగా హైకోర్టు సమీపంలోని పేట్లబుర్జ్‌ ప్రసూతి దవాఖానకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. ప్రసూతి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు పీజీ వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మిగతా వైద్యులకు కరోనా టెస్టులు నిర్వహించగా, ఇద్దరు ప్రొఫెసర్‌లతో పాటు మరో 12 మంది వైద్యులకు కరోనా సోకినట్లు తేలింది. శానిటేషన్‌ సిబ్బందిలోనూ 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరందరిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగమణి తెలిపారు.  

కరోనా కలవరం నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే రోగులకు ప్రస్తుతం చికిత్సలు అందించడం లేదని ఆమె స్పష్టం చేశారు. జిల్లా వైద్యాధికారుల ఆదేశాల ప్రకారం.. ఆస్పత్రి జారీ చేసి ఔట్‌ పేషెంట్‌ కార్డులతో పాటు నెలలు నిండిన గర్భిణులకు మాత్రమే వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఇతర జిల్లాల గర్భిణులు స్థానిక ఆస్పత్రుల్లోనే చికిత్స పొందాలని నాగమణి విజ్ఞప్తి చేశారు.


logo