శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 01:33:38

అమ్మా నాన్న పిల్లలు.. ఓ మాటాముచ్చట

అమ్మా నాన్న పిల్లలు.. ఓ మాటాముచ్చట

పొద్దుపొద్దుగాల్నే పోరగాండ్ల లొల్లి.. కంటినిండ నిద్రపోదమంటే లేదు.. లేస్తే ఫోన్లు.. గేమ్‌లు.. టీవీలు.. ఒకటే లొల్లి. ఆమె ఆయనకు పట్టట్లేదు.. ఆయన ఆమెకు పట్టట్లేదు. ఈ కరోనా కతేందో కానీ ఉన్నట్టుండి సెలవులు మీదొచ్చిపడ్డయి. సెలవులు వస్తే వచ్చినయి కదా అని ఏడికన్నా పోదామంటే అన్నీ బంద్‌ అయినయి. సినిమాల్లేవు.. షికార్లులేవు.. పార్కులు బంద్‌.. మ్యూజియంలు బంద్‌..  చివరకు జూ పార్కులు కూడా మూసేసిండ్రు. తెరిచి ఉన్నదల్లా మాల్సే.. ఆ మాల్స్‌కు పోయినమా అంతే సంగతులు. పిల్లలు కనిపించినవన్నీ కొనియ్యమంటే.. జేబులు ఖాళీ కావాల్సిందే. పోతే ఊళ్లకో.. గుళ్లకో పోవాలె.. లేకుంటే ఇంట్లోనే బందీ కావాలె. కొంచెం సికాకైనా.. చాన్రోజుల తర్వాత ఫ్యామిలీతో గడిపే రోజులొచ్చినయి. అంతా కలిసి అన్నం తింటుండ్రు.. ముచ్చట్లు పెట్టుకొంటుండ్రు.. ఇంటి ముందటనే షెటిల్‌, క్రికెట్‌ ఆడుకుంటుండ్రు.. ఏమైతేనేం కరోనా పుణ్యమా అని ఫ్యామిలీకి జాలీడేస్‌ వచ్చాయి. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరువరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. జూపార్కు సహా, పార్కులు సినిమాహాళ్లు కూడా మూసేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఆదివారం నగరవీధులన్నీ బోసిపోయి కనిపించాయి. అక్కడక్కడా జరిగిన పెండ్లిళ్లలో సందడి తప్ప జనసంచారం పెద్దగా కనిపించలేదు. సాధారణంగా ఆదివారంరోజు పిల్లలతో సినిమాలకో పార్కులకో వెళ్లే కుటుంబాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక నెలాఖరుదాకా సెలవులని తెలియడంతో పిల్లలు ‘జై కరోనా’ అంటూ ఇండ్లవద్ద సందడి ప్రారంభించారు. బ్యాట్లు.. బంతులు పట్టుకొని రోడ్డెక్కేవారు కొంద రు కాగా.. సెల్‌ఫోన్లు లేదా టీవీలకు అతుక్కొనిపోయేవారు మరికొందరు. ఓవైపు ఈ చిచ్చరపిడుగులను అదుపుచేయడం.. మరోవైపు రోజువారీ పనులు చేసుకోవడం తల్లులకు తలకుమించిన భారంగా పరిణమించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారిలో ఒకరు తప్పనిసరిగా వీరికోసం ఇండ్ల వద్ద ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా కరోనా వ్యాధి కుటుంబాలను ఒక్కచోటికి చేరుస్తున్నది. ఉరుకులు పరుగుల నగరజీవితంతో చాలామందికి కుటుంబంతో గడిపే సమయం దొరికేది కాదు. పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు ఇండ్ల వద్దనుంచే పనిచేసేందుకు అవకాశం కల్పించడంతో వారికి కుటుంబంతో గడిపే చాన్స్‌ దొరికింది. అమ్మా, నాన్న, పిల్లా పాపలతో అందరూ ఒక్కచోటచేరి ముచ్చట్లు పెట్టే అవకాశం లభించింది. సెల్‌ఫోన్లు కూడా పక్కన పెట్టేసి, టీవీలు బంద్‌చేస్తే ఆ కటుంబాల్లో ఆనందం హద్దులు దాటుతుంది.


ఫన్నీ కరోనా!

కరోనా వ్యాధి ఓవైపు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నప్పటికీ .. మనవాళ్లు మాత్రం ఆ వ్యాధిని టీజింగ్‌ చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సోషల్‌ మీడియాలో కరోనాపై అవగాహన కల్పించే అంశాలకంటే.. కామెడీ పోస్టులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలు చేసే హల్‌చల్‌పై మీమ్స్‌ హోరెత్తుతున్నాయి. యూట్యూబ్‌ వేదికగా షార్ట్‌ ఫిల్మ్‌లు, టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. జోకులు, సెటైర్లకైతే కొదువే లేదు. 


కుటుంబంతో కలిసి..

నగరవాసుల్లో కరోనా భయం కనిపిస్తున్న దాఖలాలు లేవు. వ్యాధి నిర్ధారణ అయిన ఆ ఒక్క వ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి చేరడం నగరవాసులకు ధైర్యాన్నిచ్చింది. విదేశాల నుంచి వచ్చేవారికి తప్ప స్థానికులకు కరోనా రాదన్న ధీమా కనిపిస్తున్నది. దీనికితోడు ‘మనకు కరోనా అంత సులభంగా రాదులే’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రజలకు నైతిక బలాన్నిస్తున్నాయి. ఇక సెలవులు కూడా అందిరావడంతో యువత దూరప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని కుటుంబాలు తిరుమల, యాదాద్రి, భద్రాద్రి వంటి యాత్రాస్థలాలకు బయల్దేరుతున్నారు. చాలామంది ఎండలు ముదరకముందే అమ్మమ్మ, నానమ్మ తాతయ్యల వద్దకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. 


పురోహితులకు తగ్గిన గిరాకీ

ఈ నెలాఖరువరకే ఫంక్షన్‌హాళ్లలో  పెండ్లిళ్లు జరిగేందుకు అనుమతిస్తామని, ఆ తరువాత అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో చాలామంది తమ వివాహాలను వాయిదా   వేసుకుంటున్నారు. దీంతో వేసవి పెండ్లిళ్ల   సీజన్‌లో పురోహితులకు పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితి వారి జీవనోపాధికి గండికొట్టిందనే చెప్పవచ్చు. మరోవైపు ఫంక్షన్‌ హాళ్ల బుకింగ్‌లు నిలిచిపోగా, ఇప్పటికే బుకింగ్‌ అయినవి  రద్దవుతున్నాయి. 


కుటుంబానికి సమయం దొరికింది: పవన్‌

సాధారణంగా కుటుంబంతో కలిసి గడపడానికి సమయం కుదిరేది కాదు. కానీ అనుకోకుండా దొరికిన సెలవులతో కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం వచ్చింది. అందరం కలిసి రెస్టారెంట్‌కు వెళ్లాం. ఇతర రోజులకంటే నేడు హోటళ్లలో కూడా ఫ్యామిలీలు ఎక్కువగా కనిపించాయి.


స్నేహితులతో టూర్‌ వేసుకున్నాం: రామచంద్రారెడ్డి

అనుకోకుండా సెలవులురావడం చాలా సంతోషంగా ఉంది.  స్నేహితులతో కలిసి వారంరోజుల టూర్‌ వేసుకున్నాం. ఆదివారం మధ్యాహ్నమే బయల్దేరాం. మొదట తిరుమల వెళ్లి వచ్చేటప్పుడు తెలంగాణలోని చూడదగ్గ ప్రదేశాలు, ఆలయాలు తిరిగి వచ్చేలా ప్రణాళికలను వేసుకున్నాం.


logo