సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 28, 2020 , 01:09:58

తగ్గుముఖం పట్టిన కరోనా

తగ్గుముఖం పట్టిన కరోనా

  • ఈ నెలలో మొదటిసారి కొత్తగా 2 కేసులే నమోదు
  • 12 జిల్లాల్లో కేసులు నిల్‌
  • కరీంనగర్‌లో మిగిలింది ఒక్కటే
  • సూర్యాపేట జిల్లాలోనూ మెరుగు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితమిస్తున్నాయి. సోమవారం ఇద్దరికి మాత్రమే.. అది కూడా హైదరాబాద్‌వారికే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైద్యారోగ్యశాఖ సిబ్బంది నిరంతర అవగాహనా చర్యలు, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీసు, రెవెన్యూశాఖ చేపట్టిన కట్టడి.. వెరసి తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఆరు రోజులుగా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం 2 మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో కోలుకొన్న వారికంటే కొత్త కేసులు తక్కువగా నిర్ధారణ కావడం శుభపరిణామమని వైద్యులు చెప్తున్నారు. సోమవారం నాటికి సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో కరోనా కేసులు లేనట్టు వైద్యశాఖ నిర్ధారించింది. కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 19 కేసులకు, 18 మంది డిశ్చార్జి అయ్యారు. ఇంకా ఒక్కరు మాత్రమే చికిత్స పొందుతున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ పరిస్థితి అదుపులోకి వస్తున్నది. 14 రోజులుగా కేసులు నమోదుకాకపోవడంతో మూడు కంటైన్మెంట్లను ఎత్తివేశారు. 83 పాజిటివ్‌ కేసుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు.

మొత్తం కేసులు 1,003

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,003 కేసులు నమోదు కాగా, ఇందులో 646 మంది గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 332 మంది డిశ్చార్జి కాగా, 25 మంది మృత్యువాతపడ్డారు. సోమవారం కేవలం 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, 16 మంది డిశ్చార్జి అయ్యారని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది.

రికవరీ క్యాటగిరీలో తెలంగాణ..

బ్రూక్లింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీనియర్‌ ఫెలో, ప్రధాని ఆర్థిక సలహామండలి మాజీ సభ్యురాలు ప్రొఫెసర్‌ షమికా రవి.. భారత్‌లో కరోనా పరిస్థితిపై గణాంకాల ఆధారంగా విశ్లేషణ జరిపారు. కరోనా రికవరీ విషయంలో తెలంగాణ పురోగతి సాధిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన సంకేతాలు కనిపిస్తున్నాయని, తద్వారా కరోనా రేఖ దిగివస్తున్నదని చెప్పారు. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక్ర్టలను రికవరీ క్యాటగిరీలో చేర్చిన ఆమె.. మహారాష్ట్ర, ఏపీ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లను ‘ఆందోళకర’ జాబితాలో చేర్చారు. 


రాష్ట్రంలో కేసుల వివరాలు

వివరాలు  
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
21,003  
కోలుకున్న/డిశ్చార్జి అయినవారు
16332
మరణాలు
- 25
చికిత్స పొందుతున్నవారు
-646


ఏపీలో కరోనా విలయతాండవం

  • 1,177కు చేరిన బాధితుల సంఖ్య
  • రాజ్‌భవన్‌లో మరికొందరు క్వారంటైన్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నది. సోమవారం ఉదయానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,177కు చేరింది. కృష్ణా జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో గుంటూరు, కర్నూలు ఉన్నాయి. ఇప్పటికి 31 మంది మరణించగా, 235 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీ రాజ్‌భవన్‌లో నలుగురికి కరోనా నిర్ధారణ కావడంతో వారితో కాంటాక్ట్‌లో ఉన్న మరికొంతమందిని క్వారంటైన్‌కు తరలించారు. కృష్ణా జిల్లాలో ఎనిమిది మంది పోలీసులు, నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. 


logo