శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 18:56:06

కరోనాకు ప్రత్యేక చికిత్సేమి లేదు : మంత్రి ఈటల

కరోనాకు ప్రత్యేక చికిత్సేమి లేదు : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందొద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం మీడియాతో మాట్లాడారు. కరోనా సోకిన వ్యక్తి నయమై ఇంటికి వెళ్తున్నాడని మంత్రి తెలిపారు. కరోనా తీవ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని.. దీనికి ప్రత్యేకంగా చికిత్స అందుబాటులోకి రాలేదు అని పేర్కొన్నారు. కరోనా నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు నమోదు కాలేదన్నారు. కరోనా గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కరోనాపై గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులోకి వచ్చిందన్నారు. కొత్తగా మరో మూడు ఆస్పత్రుల్లో పరీక్షలకు అనుమతి వచ్చిందని తెలిపారు. వరంగల్‌ ఎంజీఎం, ఐపీఎం హైదరాబాద్‌, ఫీవర్‌ ఆస్పత్రుల్లోనూ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయన్నారు. ఈ ఐదు ఆస్పత్రుల్లోనూ అవసరమైన సిబ్బంది, కిట్స్‌ సరఫరా చేశామన్నారు. పూర్వ 9 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు, ఐసీయూలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. వైరల్‌ జ్వరాలు వచ్చినవారికి ఎలాంటి మందులను ఇస్తున్నామో కరోనా వచ్చిన వారికి కూడా అవే మెడిసిన్స్‌ ఇస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.


logo