బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 08:57:25

ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు

ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు

హైదరాబాద్ :  మనమేదైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటే ఎంతసేపు గుర్తుంటుంది. అయితే ఆ రోజు.. మహాఅయితే మరుసటిరోజు. ముందురోజు చదివింది..విన్నది మొత్తానికి మొత్తంగా గుర్తుపెట్టుకోవడం ఎవరివల్లా కాదు. నేర్చుకున్న దాంట్లో 70శాతానికి పైగా మర్చిపోతాం. ఇలా ఏ రోజుకారోజు కొత్తదనమే. నిన్న నేర్చుకున్నది నేడు ..ఇవాళ నేర్చుకున్నది రేపు గుర్తుండే అవకాశాలు తక్కువే. పెద్దల సంగతే ఇలా ఉండే.. పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అంతేకాదండోయ్‌ 45నిమిషాల పీరియడ్‌లో ఓ ఐదు నిమిషాలపాటు ఏమరుపాటుగా ఉంటే టీచర్‌ ఏం చెప్పారో.. చెబుతున్నారో అర్థంకాదు. 

ఇక నాలుగురోజులు స్కూలుకు డుమ్మాకొట్టి తెల్లారి పుస్తకాలు పడితే ఏదీ ఓ పట్టాన అర్థం కాదు. అలాంటిది రోజుల తరబడి సెలవులు వస్తే గందరగోళమే. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, వీడియోగేమ్‌లు, ఫోర్న్‌వీడియోల వెల్లువలో పొంచిఉన్న ప్రమాదాన్ని ఇట్లే ఊహించగలం. తాజా వరుస సెలవుల నేపథ్యంలో పిల్లలను గాడిన పెట్టడమంటే కత్తిమీద సవాలే. కరోనా ఆకస్మిక సెలవుల నేపథ్యంలో అప్రమత్తమైన పాఠశాలలు పిల్లలు చెడుమార్గాలు పట్టకుండా జాగ్రత్తపడుతున్నాయి. ఆన్‌లైన్‌ పాఠాలను ఎంచుకుని అమలు చేస్తున్నాయి. కొన్ని పాఠశాలలు వాట్సాప్‌ను, మరికొన్ని యూట్యూబ్‌ను వినియోగించుకుని బోధనను కొనసాగిస్తున్నాయి. పిల్లలు .. టీచర్లు ఇంట్లోనే ఉంటూ రోజుకో కొంత విజ్ఞానాన్ని పంచుతున్నారు.

ఎలా చేస్తున్నారంటే..

  • టీచర్‌ ఇంట్లోనే ఉంటారు. వాట్సాప్‌ సహకారంతో అటు పాఠశాల, ఇటు పిల్లల తల్లిదండ్రులతో అనుసంధానం జరుగుతుంది.
  • ప్రతిరోజూ పిల్లల తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఒక వర్క్‌షీట్‌కు పంపిస్తున్నారు. నిర్దిష్ట వ్యవధిలో దీనిని పిల్లలు పరిష్కరించాలి. పిల్లలు రాసిన సమాధానపత్రాలను తల్లిదండ్రులు ఇమేజ్‌రూపంలో తిరిగి టీచర్‌కు పంపించాలి. టీచర్లు మూల్యాంకనం చేసి మరలా తల్లిదండ్రులకు పంపిస్తారు.
  • తరగతిలోని మొత్తం టీచర్లలో ఎవరో ఒక టీచర్‌ పిల్లలకు ఫోన్‌చేసి మాట్లాడతారు. ఇలా పిల్లలందరితో మాట్లాడతారు. వారు పూర్తిచేసిన వర్క్‌షీట్‌లోని తప్పొప్పులను వారితో చర్చిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజూ పిల్లలకు రీడింగ్‌ రివిజన్‌ టార్గెట్స్‌ నిస్తున్నారు. కేవలం పాఠ్యపుస్తకాల్లోని అంశాలేకాకుండా.. జనరల్‌ బుక్స్‌, స్టోరీ చదివించడం లాం టివి చేస్తున్నారు. అంతేకాకుండా వారు  చదివారా లేదా అన్నది సైతం పర్యవేక్షణ జరుపుతున్నారు. వారు చదివిన బుక్‌, స్టోరీ అంశాన్ని కుప్తం గా రాసి పంపమని సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ చేస్తున్నట్లుగా టీచర్లు చెబుతున్నారు.
  • ఉన్నత తరగుతులకు సంబంధించిన పాఠాలను, ఉపాధ్యాయులు వీడియోలుగా చిత్రీకరించి, తల్లిదండ్రులకు పంపించడం, యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి లింక్‌ పంపడం చేస్తున్నారు.


logo