మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 20, 2020 , 09:17:40

దగ్గరి చుట్టాలు కూడా పెండ్లిలకు రావడం లేదు...

దగ్గరి చుట్టాలు కూడా పెండ్లిలకు రావడం లేదు...

హైదరాబాద్ : కరోనా వైరస్ భయంత నగరంలో కల్యాణాలు కళతప్పాయి. జనాలు లేక పెండ్లిపందిళ్లు వెలవెలబోయాయి. చాలా దగ్గర వారు తప్ప మిగతావారు ఎవ్వరూ పెండ్లిలకు హాజరుకావడం లేదు. చాలామందికి ఫోన్‌లో లేదా వీడియోకాల్‌ల్లో  శుభాకాంక్షలు చెప్పి ఊరుకుంటున్నారు. దీంతోపాటు పక్క జిల్లాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి పెండ్లిండ్లకు హాజరయ్యేందు కు కూడా జనాలు ఆసక్తి చూపడం లేదు. కరోనాభయంతో ప్రజలు ఇండ్లు వదిలి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పెండ్లి చేస్తున్న కుటుంబాలు ఎన్నో అంచనాలతో వేలాదిమందికి ఆహ్వానం పంపినా వందల్లో మాత్రమే హాజరవడంతో చేసిన ఏర్పాట్లన్నీ నిరుపయోగమయ్యాయి. జీవితంలో జరుపుకునే అతిపెద్ద పండుగకు ఆప్తులు, బంధుమిత్రులు దూరంగా ఉండడంతో పెండ్లి చేసుకునే వారి, వారి కుటుంబాల్లోనూ అసంతృప్తి నెలకొంది. చాలామంది పెండ్లిండ్లను వాయిదా వేసుకుంటున్నారు. 

వృథా అవుతున్న ఖర్చు...

నగరంలో ఒక్క గురువారమే దాదాపు 3వేలకుపైగా పెండ్లి నిశ్చయించుకున్నా చాలామంది వాయిదా వేసుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పెండ్లిండ్లు జరిగాయి. దానికీ తక్కువమంది హాజరుకావడంతో లక్షలాది రూపాయల వృథా అయ్యాయి. దాదాపు వెయ్యిమందికి సరిపోయేలా సదుపాయాలు, వంటలు, కుర్చీలు, ఫంక్షన్‌ హాల్‌ వంటివి లక్షల రూపాయలు పెట్టి ఏర్పాటు చేసుకున్నారు. తీరా చేసుకున్న ఏర్పాట్లలో చాలావరకు వృథాగా మారాయి. వచ్చిన కొద్దిపాటి జనాల్లో కూడా తక్కువమంది మాత్రమే ఆహారాన్ని తీసుకోవడంతో పెద్దఎత్తున వంటలు వృథా అయ్యాయి.  

మాస్కులు- శానిటైజర్ల వాడకం 

పెండ్లిండ్లకు హాజరవుతున్న వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కొన్నిచోట్ల పెండ్లి పందిట్లో మాస్కులు ధరించి కూర్చున్నారు. అలాగే ద్వారం వద్దనే శానిటైజర్లను ఏర్పాటు చేసి తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకునేలా పనివారిని పెట్టి అమలు చేసిన వారు కూడాలేకపోలేదు. కొన్నిచోట్ల పెండ్లికి హాజరైన వారికి మాస్కులను కూడా అందించారు నిర్వాహకులు.

ఈవెంట్‌ ఆర్గనైజర్లకు, పురోహితులకు, క్యాటరింగ్‌కు ఆర్డర్లు డీలా...

 సాధారణంగా నగరంలో జరిగే ఎక్కువశాతం పెండ్లిండ్లకు ఈవెంట్‌ ఆర్గనైజర్ల నుంచి క్యాటరింగ్‌ సర్వీసుల వరకు చాలా సేవలు అందించే వారిని ఉపయోగించుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెండ్లిండ్లు తక్కువగా జరుగుతుండడందో చాలామందిపై ఈ ప్రభావం పడుతుంది. ఇప్పటికే మాట్లాడి పెట్టుకున్న ఈవెంట్‌ ఆర్గనైజర్లతో మీసేవలు మాకు వద్దు పెండ్లి వాయిదా వేసుకున్నామంటూ చాలామంది ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకున్నారు. నగరంలో దాదాపు ఈవెంట్‌ ఆర్గనైజర్లకు వచ్చిన 80 శాతానికిపైగా పెండ్లిండ్లు  రద్దయ్యాయి. దీంతోపాటు క్యాటరింగ్‌, బాజా భజంత్రీలు, పాటల కచేరీ చేసే వారికి కూడా పెద్దగా గిరాకీ లేకుండా పోయింది. తప్పనిసరిగా పురోహితులు అవసరం ఉన్నా తక్కువ సం ఖ్యలో పెండ్లిండ్లు జరుగుతుండడంతో చాలామంది పురోహితులకు పని లేకుండా పోయింది. చేసేదేమి లేక పెండ్లికి సేవలు అందించే వారికి ఆదాయం చాలా తగ్గిపోయింది. అలాగే బహుమతులను తీసుకునేందుకు నూతన వధూవరులు జంకుతున్నారు. దీంతో వారు తెచ్చిన బహుమతులను మండపంలో ఓ పక్కన పెట్టి పోతున్నారు. 


logo
>>>>>>