శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 19, 2020 , 01:37:43

40 వేల కరోనా మందు లక్ష!

40 వేల కరోనా మందు లక్ష!

  • టోసిలిజుమాబ్‌ను  దాచేస్తూ దోపిడీ
  • కొన్ని ప్రైవేట్‌ దవాఖానల కక్కుర్తి 
  • ఐదింతల అధికరెట్లకు రెమ్‌డిసివిర్‌ 

హైదరాబాద్‌కు చెందిన సాగర్‌ సోదరుడికి కొవిడ్‌ సోకింది. వెంటిలేటర్‌పై ఉంచామని, అర్జెంట్‌గా టోసిలిజుమాబ్‌ ఇంజెక్షన్‌ ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. మెడికల్‌ హాల్‌కు వెళ్తే ఆ ఇంజెక్షన్లు అందుబాటులో లేదని చెప్పారు. విషయాన్ని డాక్టర్‌కు చెప్తే.. ‘వేరే దగ్గరి నుంచి తెప్పిస్తాం. కాకపోతే ధర కాస్త ఎక్కువవుతుంది’ అని చెప్పి రూ.40 వేల ఇంజెక్షన్‌కు రూ.90 వేలు వసూలుచేశారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి వేళ కొన్ని ప్రైవేట్‌ దవాఖానలు కక్కుర్తి ప్రదర్శిస్తున్నాయి. ఔషధాల ముసుగులో కాసుల వేటలో పడ్డాయి. ఇప్పటికే చికిత్సకు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా మందులనూ దాచి బ్లాక్‌ దందా చేస్తున్నట్టు తేలింది. ఫార్మా దిగ్గజ సంస్థ సిప్లా తయారుచేసే ‘టోసిలిజుమాబ్‌'.. కరోనా రోగులకు సంజీవనిగా పనిచేస్తున్నది. పరిస్థితి విషమంగా ఉండి వెంటిలేటర్‌పై ఉన్నవారికి దీనిని వినియోగిస్తున్నారు. ఈ మందుతో సత్ఫలితాలు వస్తున్నాయని, 60-70 శాతం మంది కోలుకుంటున్నారని వైద్యులే చెప్తున్నారు. టోసిలిజుమాబ్‌ 40 మిల్లీలీటర్ల ఒక్కో వయల్‌ ధర రూ.40,425. కానీ.. అందుబాటులో లేవనే వంకతో రూ.లక్ష వరకు వసూలుచేస్తున్నారు. రూ.5,400 విలువ చేసే రెమ్‌డెసివిర్‌ను రూ.20 వేలకుపైగానే విక్రయిస్తున్నారు. 

మెడికల్‌ షాపుల్లో దొరుకదు 

టోసిలిజుమాబ్‌ సాధారణ మెడికల్‌ షాపుల్లో దొరుకదు. కొవిడ్‌ దవాఖానలకే సరఫరాచేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. రోగి ఆధార్‌కార్డు, పాజిటివ్‌ రిపోర్టు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉంటేనే ఈ ఔషధాన్ని వినియోగించాలి. కొన్ని ప్రైవేట్‌ దవాఖానలు రోగుల బంధువులను కావాలనే మెడికల్‌ షాప్‌కు పంపి.. అక్కడ దొరుకడం లేదనే సాకుతో అధిక ధరలు వసూలుచేస్తున్నాయి. టోసిలిజుమాబ్‌ను కీళ్లవాతానికి (రుమెటాయిడ్‌ ఆర్థరైటిస్‌) చికిత్సలో వినియోగిస్తారు. పరిస్థితి విషమించి వెంటిలేటర్‌పై ఉన్న రోగులపై ప్రభావవంతంగా పనిచేస్తున్నదని పరిశోధనల్లో తేలింది. 

ఔషధాల బ్లాక్‌ దందా ముఠా అరెస్టు

9 రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా చికిత్సకు ఉపయోగించే రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లను అధిక ధరకు విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఫార్మసీ దుకాణంలో పనిచేసే స్టాఫ్‌ నర్సులే ఈ దందాకు పాల్పడుతున్నట్టు తేలింది. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం ఏడుగురిని అరెస్టు చేశారు. లంగర్‌హౌజ్‌ నానల్‌నగర్‌లోని అలీవ్‌ దవాఖానలోని ఓపీ ఫార్మసీలో అబ్దుల్‌ అజీజ్‌ పనిచేస్తున్నాడు. చాలామంది రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లను అడుగుతుండటంతో వీటిని విక్రయించి డబ్బు సంపాదించాలని స్కెచ్‌ వేశాడు. వీటిని బ్లాక్‌లో విక్రయించే వారి కోసం గాలిస్తుండగా అలీవ్‌ దవాఖానలో పనిచేసే రాజు.. రూ.5400 ధర ఉన్న ఇంజెక్షన్‌ను రూ.19 వేలకు అందిస్తానని అజీజ్‌కు చెప్పాడు. రాజుకు ఈ ఇంజెక్షన్‌ను ఎల్బీనగర్‌ మెడిసిస్‌ దవాఖానలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న సునీల్‌ రూ.6,500కు సరఫరా చేస్తానని తెలిపాడు. రవి అనే మరో వ్యక్తి కూడా ఇంజెక్షన్‌ను రూ.10 వేలకు విక్రయిస్తానని అజీజ్‌కు చెప్పాడు. అజీజ్‌ మొత్తం 11 రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లు, ఒకటి సిప్రేమీ ఇంజెక్షన్‌ను రాజు, రవి నుంచి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.20 వేల చొప్పున మహ్మద్‌ మాజిద్‌ అలీకి విక్రయించాడు. మహ్మద్‌ మాజిద్‌ అలీ, అతని స్నేహితుడు మహ్మద్‌ అఫాక్‌ అలీ కలిసి.. ఒక్కో ఇంజెక్షన్‌ను రూ.28 వేల చొప్పున సమీర్‌ దవాఖానలోని ఫార్మసీలో పనిచేసే మహ్మద్‌ ఒబేద్‌కు అమ్మారు. ఒబేద్‌.. సమీర్‌ దవాఖాన యాజమాన్యంతో కలిసి అధికధరకు అమ్మాలని నిర్ణయించుకుని రోగుల కోసం ఎదురుచూస్తున్నారు. 17న నిందితులంతా కలిసి ఇంజెక్షన్ల విక్రయానికి ప్లాన్‌చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి.. 9 రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లు, సిప్లా సంస్థకు చెందిన సిప్రేమీ ఇంజెక్షన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్‌ ఒబేద్‌, మహ్మద్‌ అఫాక్‌ అలీ, మహ్మద్‌ మాజిద్‌ అలీ, అబ్దుల్‌ అజీజ్‌, రాజు, సునీల్‌, రవిని అరెస్టుచేశారు.logo