మంగళవారం 02 జూన్ 2020
Telangana - Apr 03, 2020 , 00:42:18

ఏపీలో 143 కేసులు

ఏపీలో 143 కేసులు

-గురువారం ఒక్కరోజే 32 మందికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు రోజుల నుంచి వేగంగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మత కార్యక్రమానికి హాజరై తిరిగి రాష్ర్టానికి వచ్చిన వాళ్లతో వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నది. బుధవారం వరకు 111 పాజిటివ్‌ కేసులు ఉండగా.. ఈ సంఖ్య గురువారం నాటికి 143కి చేరింది. గురువారం ఒక్కరోజే 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి మత ప్రార్థనల కోసం వెళ్లి వచ్చిన వారి కుటుంబాలను క్వారంటైన్‌కు తరలించామని, ఇప్పటి వరకు 1800 మంది నమూనాలను పరీక్షించగా.. 1321 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలిపారు. 409 మంది పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. మరోవైపు గుంటూరులోకరోనా కేసులు వెలుగుచూడటంతో దాదాపు 3 కిలోమీటర్ల పరిధితోపాటు మంగళగిరిని కూడా రెడ్‌జోన్‌గా ప్రకటించారు.  

21 మంది ఆచూకీ లేదు

ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 21 మంది ఆచూకీ లభించలేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపింది.  హిందూపురానికి చెందిన ఒక మహిళ బెంగళూరులో ఇటీవల కరోనాతో మృతిచెందారు. ఆమె కోడలు, మనుమరాలికి కూడా వైరస్‌ సోకినట్లు తేలింది. ఆ మహిళ కుటుంబంలో ఒకరు ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో అనంతపురం నుంచి ఎంతమంది బెంగళూరు వెళ్లారనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 


logo