గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 02:08:55

గరిష్ఠంగా 3 రోజులు!

గరిష్ఠంగా 3 రోజులు!

  • ఇదీ.. ప్లాస్టిక్‌ వస్తువులపై కరోనా వైరస్‌ జీవితకాలం గాలిలో మూడుగంటలు  
  • రాగి వస్తువులపై నాలుగు గంటలు.. కార్డ్‌బోర్డుపై 24 గంటలు 
  • స్టెయిన్‌లెస్‌ స్టీల్‌పై రెండు నుంచి మూడురోజులు  
  • శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పదివేలకుపైగా ప్రాణాలను బలిగొన్న కరోనా వ్యాధిని  అరికట్టేందుకు దానిని విస్తరించకుండా ఆపడమే ఏకైక మార్గమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వైరస్‌ సోకకుండా అరికట్టే వ్యాక్సిన్‌ తయారీకి, లేదా కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాల ఉత్పత్తికి చాలాసమయం కావాల్సి ఉన్నందున ఆ మహమ్మారిని ఒకరినుంచి మరొకరికి వ్యాప్తిచెందకుండా నివారించాలని పేర్కొంటున్నారు. ఇందుకు ముందుజాగ్రత్త చర్యలు పాటించడమే మార్గమని తెలిపారు. ఈ వైరస్‌ ఓ వ్యక్తికి ఎలా సోకుతుంది, దాని ఆయువుకాలం ఎంత అన్న  అంశాలపై సోషల్‌మీడియాలో అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కరోనా తొలిసారి ఉద్భవించిన చైనాలోని వుహాన్‌ నగరానికి చెందిన బాధితులపై అమెరికాకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి అనేక విషయాలను కనుగొన్నారు. 26 నుంచి 76 ఏండ్ల వయస్సు మధ్య రోగుల నుంచి నమూనాలు సేకరించారు. వీరి పరిశోధన ఫలితాలు ‘ది న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌'లో ప్రచురితమయ్యాయి.

వైరస్‌ ఎలా సోకుతుంది?

కరోనా శ్వాసకోశ సంబంధమైన వ్యాధి. కరోనా సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు అతని తుంపిర్ల ద్వారా వైరస్‌ ఇతరులను చేరుతుంది. తుంపిర్లు గాలిలో కలిసి ఇతరుల ముక్కు లేదా నోటిపై పడితే అవి నేరుగా వారి శరీరంలోకి ప్రవేశిస్తాయి. వైరస్‌ కణాలు ఏదైనా ఉపరితలంపై పడినప్పుడు, ఆ ప్రదేశాన్ని చేతితో తాకి అదే చేతితో నోరు, ముక్కు లేదా కండ్లను తాకినప్పుడు కూడా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తుంది. 


వైరస్‌ కణాలు ఎంతకాలం జీవించి ఉంటాయి?

వైరల్‌ కణాలు పడిన ఉపరితలం, ఆ పరిసరాల్లోని ఉష్ణోగ్రతలు, గాలిలోతేమ ఆధారంగా దాని జీవిత కాలం ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. వైరల్‌ కణాలు పడిన ఉపరితలాన్ని బట్టి అవి మూడుగంటల నుంచి మూడురోజుల వరకు జీవించి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గాలిలో మూడుగంటల వరకు వైరస్‌ ఉండగలదని, రాగి వస్తువుపై నాలుగు గంటలు, ప్లాస్టిక్‌పై మూడురోజుల వరకు సజీవంగా ఉండగలదని తెలిపారు. కరోనా వైరస్‌ కణాలు గుండ్రంగా, 0.06 మైక్రాన్ల నుంచి 0.14 మైక్రాన్ల వరకు పరిమాణంలో ఉండగలవని చెప్పారు. ఇవి గాలిలో మూడుగంటల వరకు తేలియాడగలవని తెలిపారు. సమయం గడుస్తున్నకొద్దీ వాటి జీవితకాలంతోపాటు శక్తికూడా తగ్గుతుందని పేర్కొన్నారు. 

నివారణ ఎలా?

వైరస్‌ను కట్టడి చేయడానికి ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ లేదా ఔషధాలు లేనందున దానిని విస్తరించకుండా అడ్డుకోవడమే మార్గమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తరచుగా చేతులు కడుక్కోవడం, శానిటైజర్స్‌ను వినియోగించడం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రుమాలును అడ్డుపెట్టుకోవటం వంటి జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. మాస్క్‌లు పెట్టుకోవాలని, ఇతరులకు కనీసం మీటరు దూరంగా ఉండాలని తెలిపారు.


logo