శనివారం 30 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:23:21

నెట్‌ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌

నెట్‌ స్పీడ్‌కు కరోనా బ్రేక్‌

  • వర్క్‌ ఫ్రమ్‌ హోం, వీడియో కాన్పరెన్స్‌లతో తగ్గిన వేగం
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలో పెరిగిన మొబైల్‌ డేటా వినియోగం
  • ఓక్లా స్పీడ్‌ టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ అధ్యయనంలో వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాను కట్టడి చేసేందుకు దేశమంతటా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో ఖాళీగా ఉండటంతో ప్రతి ఒక్కరూ మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర మాధ్యమాల వాడటంపై దృష్టి సారించారు. దీంతో ఇంటర్నెట్‌ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వినియోగదారులు భారీగా పెరుగటంతో ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌ వేగంపై ఓక్లా స్పీడ్‌ టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌ ఓ సర్వే నిర్వహించింది. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి బ్రాడ్‌ బాండ్‌ కంటే మొబైల్‌ డేటానే అధికంగా వినియోగిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. మన దేశంలో మొబైల్స్‌ వినియోగించినంతగా అమెరికాలో వినియోగించడం లేదని, అక్కడ బ్రాడ్‌ బాండ్‌ను అధికంగా వినియోగిస్తున్నట్టు తేలింది. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమే కీలకం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలు, ప్రైవేట్‌ సంస్థలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అనుమతినిచ్చాయి. పలు కంపెనీలు వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమావేశాలు నిర్వహిస్తుండటం కూడా ఇంటర్నెట్‌పై ప్రభావం చూపుతున్నది. ఇంటర్నెట్‌ వినియోగం అధికమవుతుండటం వల్ల వేగం తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో అధిక డేటా ప్లాన్‌లకు మారుతున్నారు. 

చైనాతో పోలిస్తే వేగం తక్కువే 

దేశంలో సుమారు 630 మిలియన్ల మొబైల్‌, 19 మిలియన్ల బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారులున్నారు. స్మార్ట్‌ మొబై ల్‌ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరూ కనీస ఇంటర్నెట్‌ సౌకర్యం కలిగి ఉన్నారు. కాగా, గత వారం చైనా, జపాన్‌ దేశాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ల డౌన్‌లోడ్‌ వేగం పెరిగిందని , మలేషియాలో తగ్గిందని ఓక్లా సర్వేలో తేలింది. మొబైల్‌ డౌన్‌లోడ్‌ వేగం జపాన్‌లో సాపేక్షంగా ఉందని, భారత్‌లో ఇది కాస్త  పడిపోయిందని తెలిపింది. గత వారంతో పోలిస్తే దేశంలో ఇంటర్నెట్‌ స్పీడ్‌ 4.9 శాతం తగ్గిందని పేర్కొంది.


logo