ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 10, 2020 , 19:41:47

దహన సంస్కారాల్లో పాల్గొని.. స్ఫూర్తిని నింపిన మంత్రి

దహన సంస్కారాల్లో పాల్గొని.. స్ఫూర్తిని నింపిన మంత్రి

మహబూబ్ నగర్ : కరోనా మహమ్మారి మావన సంబంధాలను దెబ్బతీసున్నది. అయిన వారిని కూడా కడసారి చూపుకు నోచుకోకుండా  చేస్తున్నది. తోబుట్టువులు, కన్నవారు కరోనాతో తనువు చాలించినా.. అక్కున చేర్చుకొని రోదించలేని దుస్థితి. అయితే సరైన జాగ్రత్తలు పాటిస్తూ అయిన వారికి ఆత్మీయమైన వీడ్కోలు ఇవ్వొచ్చు. కొందరు అజ్ఞానంతో కన్నవారి మృతదేహాలను అనాథ శవాలుగా మారుస్తున్నారు. ఈ దుస్థితి చూసి చలించిన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ అయిన వారికి ఆత్మీయమైన వీడ్కోలు ఎలా ఇవ్వొచ్చో స్వయంగా చేసి చూపించి స్ఫూర్తిగా నిలిచారు.

కరోనాతో మృత్యువాత పడ్డ వారి అంతిమ సంస్కారాలకు కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం హేయమైన చర్యగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభివర్ణించారు. అంతిమ సంస్కారాలు నిర్వహించినంత మాత్రాన కరోనా అంటుకోదన్నారు. సోమవారం కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు ఆయన పీపీఈ కిట్ వేసుకుని హాజరయ్యారు. గాంధీ తదితర దవాఖానల్లో కరోనాతో మృతిచెందిన వారిని.. వారి పిల్లలే తీసుకువెళ్లడానికి ముందుకు రాకపోవడం మనుషుల్లోని మృగత్వాన్ని సూచిస్తుందన్నారు.

కొవిడ్ నిబంధనల ప్రకారం పీపీఈ కిట్లు వేసుకొని అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని మంత్రి  తెలిపారు. ఈ సందేశాన్ని అందరికీ చేరవేయాలని ఉద్దేశంతోనే జిల్లా కేంద్రంలో ఓ ప్రముఖుడి అంత్యక్రియలకు హాజరైనట్లు వెల్లడించారు. కరోనాతో చనిపోయిన తల్లిదండ్రుల్ని తీసుకువెళ్లడానికి ముందుకు రాని వారి జన్మ వృథా అన్నారు. 


అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా ముందుకు రారని తెలిసి ఉంటే అలాంటివారికి జన్మనివ్వడమే వృథా అని తల్లిదండ్రులు భావించే వారన్నారు. అపోహలు వీడి ఆప్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంత్రి స్ఫూర్తివంతమైన నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.logo