శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 01:58:04

నిర్లక్ష్యమే ప్రాణం తీస్తున్నది

నిర్లక్ష్యమే ప్రాణం తీస్తున్నది

  • కరోనా వైరస్‌కు చంపే శక్తిలేదు: మంత్రి ఈటల

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌కు చంపే శక్తిలేదని, మన నిర్లక్ష్యమే దానికి ఆ బలాన్ని చేకూర్చుతున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని కస్తూర్బా మహిళా కళాశాలలో పీజీ సెమినార్‌ హాల్‌ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎంతో సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా వైరస్‌ వల్ల భయాందోళనచెందాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రకృతి ప్రకోపిస్తే మనిషి తట్టుకోలేడనే విషయం ప్రస్తుత విపత్తుతో అర్థమవుతున్నదని చెప్పారు. కొద్దిరోజుల్లో కరోనా తగ్గుముఖం పడుతుందని, ఇకనుంచి మానవ సంబంధాలను కాపాడుతూ, బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కరోనా కంటే ముందు సార్స్‌, మెర్స్‌ వంటి అనేక వైరస్‌లు వచ్చాయని, కానీ ఇప్పుడు మాత్రమే ఇంతగా ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. దీంతో కరోనా సోకినవారిని వెలివేసే దాకా భయం వచ్చిందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కరోనాకు మొదటి మందు ధైర్యం అయితే, రెండోది ఆక్సిజన్‌ అని, మూడోది సమాజం అందించే మద్దతు అని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం చాలా అవసరమని తెలిపారు.  ఇంతటి విపత్తు వస్తుందని ఎవరూ ఊహించలేదని చెప్పారు.


logo