శనివారం 30 మే 2020
Telangana - Apr 08, 2020 , 06:50:18

100 రోజుల విలయం

100 రోజుల విలయం

రోగులు14 లక్షలు.. మృతులు 81 వేలు
అమెరికా, ఐరోపాలో తాండవం.. ఐసీయూలో బ్రిటన్‌ ప్రధాని
తెలంగాణ లో మరో 40 కేసులు 
 మొత్తం పాజిటివ్‌ 404.. 45 మంది డిశ్చార్జి
348 మందికి ఐసొలేషన్‌లో చికిత్స

చావే ఉండకూడదని వరం పొందిన గజాసురుడిలా, సాచే కోరలతో సమస్తాన్ని చుట్టుముట్టే వృత్రాసురుడిలా, తన నెత్తుటి చుక్క పడిన ప్రతి చోటా పదివేల రక్కసులై విస్తరించే రక్తబీజుడిలా,గాలినే విషపు గత్తరగా మార్చి ఏమార్చే ధూమ్రాక్షుడిలా& కరోనా! మొత్తం భూ మండలాన్ని చాపచుట్టి చంకనబెట్టుకున్న హిరణ్యాక్షుడిలా ప్రపంచాన్ని  చుట్టుముట్టింది. దేశదేశాలను ఆవరించి, ఆవహించింది. కరోనా రక్కసి జాడ పట్టి నేటికి  సరిగ్గా వంద రోజులు. విశ్వ మానవుడి ఊపిరిలో హాలాహలాన్ని, గొంతులో హాహాకారాన్ని నింపిన కరోనా విలయ తాండవానికి యావత్తు జగత్తూ అల్లకల్లోలం. లక్షల్లో వ్యాధిగ్రస్తులు. 81 వేల మంది అకాల మరణం. మనకు తాను కనిపించకుండా, మనిషికి మనిషిని శత్రువుగా మారుస్తున్న మాయావి అది! మానవాళి దూరందూరంగా నిలబడి, కలబడితే తప్ప రణాన్ని గెలువలేని తరుణమిది. చేతులు కలపకుండా ఛేదిస్తే తప్ప బద్దలు కాని శృంఖలమిది! 


హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : రెండో ప్రపంచయుద్ధం తరువాత మొదటిసారిగా మానవాళిని గడగడలాడిస్తున్న అతిపెద్ద సంక్షోభం కరోనా. చిన్నా, పెద్ద అన్న వివక్ష చూపకుండా, పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రపంచ దేశాలన్నింటిపై ఏకధాటిగా దాడి చేస్తున్న మహమ్మారి ఈ కరోనా. దీనిని రాకుండా ఆపే వ్యాక్సిన్‌ లేదు.. వచ్చిన తరువాత చికిత్స చేసేందుకు ఔషధమూ లేదు. రోజూ వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటూ మారణహోమం సృష్టిస్తున్న ఈ మహమ్మారిని గుర్తించి నేటికి వంద రోజులవుతున్నది. చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన ఈ అంటువ్యాధి నేడు భూమండలమంతటా విస్తరించింది. ఏకకాలంలో అనేకమందికి ముప్పుగా ఈ వ్యాధి పరిణమించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ‘మహమ్మారి’గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రానికి 13.6 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా, 81వేల మంది వరకూ మరణించారు. ఈ వ్యాధి ధాటికి ఇటు ఐరోపా దేశాలు, అటు అమెరికా విలవిలలాడుతున్నాయి. 

ఈ అంటువ్యాధిని అడ్డుకోవడానికి లాక్‌డౌన్‌ విధించడంతో ఆర్థికవ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. స్టాక్‌మార్కెట్లు కోలుకోనిరీతిలో దెబ్బతిన్నాయి. ఆర్థికంగానే కాకుండా ఇటు సామాజికంగా, అటు మానసికంగా కూడా ఆ మహమ్మారి మానవాళిని కృంగదీస్తున్నది. వైరస్‌కు ప్రాణం పోసిన వుహాన్‌ నగరంలో దాని తీవ్రత పూర్తిగా తగ్గిపోగా, ఇతరదేశాలలో మాత్రం అది విజృంభిస్తున్నది. వుహాన్‌ నగరంలో మొదటిసారిగా మంగళవారం కరోనా కారణంగా ఒక్కరు కూడా మరణించలేదని చైనా ప్రభుత్వం తెలిపింది. అమెరికాలో 3.70 లక్షల మందికి వైరస్‌ సోకగా, 11 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారు. న్యూయార్క్‌ నగరం కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. గత 24 గంటల వ్యవధిలో వెయ్యిమందికి పైగా మరణించారు. 

అమెరికాలో రెండున్నర లక్షల మంది వరకూ మృత్యువాత పడవచ్చన్న     అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక యూరోప్‌లోని ఇటలీ, స్పెయిన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లో పౌరులు పిట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. మృతదేహాలను ఖననం చేయడానికి స్థలం చాలక సామూహికంగా సమాధి చేస్తున్నారు. ఇటలీలో 17వేలు, స్పెయిన్‌లో 14వేలు, ఫ్రాన్స్‌లో 9వేలు, బ్రిటన్‌లో ఆరువేల మంది వరకూ మరణించారు. బ్రిటన్‌లో మంగళవారం ఒక్కరోజే 854 మంది మృతిచెందారు. వ్యాధి తీవ్రత తగ్గేనాటికి కనీసం 66వేల మంది బ్రిటన్‌పౌరులు మరణించవచ్చని భావిస్తున్నారు. జపాన్‌ ప్రభుత్వం ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది.

కరోనా బారిన పడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. కెనడా ప్రధాని భార్య 14 రోజుల స్వీయ నిర్బంధం అనంతరం కోలుకోగా, స్పెయిన్‌ రాకుమారి మాత్రం ఆ మహమ్మారికి బలయ్యారు. ఎన్నో ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ భారత్‌లో చాపకిందనీరులా విస్తరిస్తున్న మహమ్మారి 4,789 మందికి అంటుకుంది. కాగా ఇప్పటికి 124మంది దానికి బలయ్యారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగీ జమాత్‌ నేడు దేశంలో కరోనాకు హాట్‌స్పాట్‌గా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారి కారణంగా దేశమంతటా కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో నేటితో కరోనాకు చరమగీతం పలుకుదామన్న సంబురంపై నిజాముద్దీన్‌ రూపంలో వచ్చి నీళ్లు చల్లింది.

ఎన్నో సవాళ్లు

కరోనా కల్లోలం విసురుతున్న సవాల్‌ను ఎలా అధిగమించాలి? వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుంది? భారతీయ కంపెనీల పాత్ర ఏమిటి? ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా చితికిపోతున్న ప్రజల భవిష్యత్తును ఎలా సరిదిద్దాలి? ఇలా అనేక సవాళ్లు నేడు ప్రజలను, ప్రభుత్వాలను వేధిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం భయపెడుతున్నా.. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రభుత్వాలన్నీ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఆంక్షలను ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి. రోగులకు చికిత్సనందించేందుకు అమెరికాలో దవాఖానలు సరిపోవడం లేదు. దీంతో నౌకాదళాన్ని రంగంలోకి దించారు. ఓ యుద్ధనౌకను దవాఖానగా మార్చారు. బ్రిటన్‌లో రెండు ఫుట్‌బాల్‌ స్టేడియాలను దవాఖానలుగా మార్చారు. మాస్కులు వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి వింబుల్డన్‌ టెన్నిస్‌ పోటీలు వాయిదా పడ్డాయి. స్పెయిన్‌లో మరణాల సంఖ్య పదివేలు దాటిపోయింది. మనదేశంలో ఎక్విప్‌మెంట్‌ సమస్య ఉంది.

- మధుకర్‌ వైద్యుల

లాక్‌డౌన్‌తోనే పరిష్కారం


కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీకి భారత్‌ సహా ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని ఆస్ట్రేలియాకు చెందిన ఫార్మా కంపెనీ ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవాలంటే ఇన్‌ఫెక్షన్‌ చైన్‌కు అడ్డుకట్టవేయాలి. అది ఐసొలేషన్‌తోనే సాధ్యం. మార్చి 25 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో ఉండటంతో కోట్లమంది భారతీయులు ఇండ్లకే పరిమితమయ్యారు. 30 కోట్ల మంది అమెరికన్లు స్వీయనిర్బంధంలో ఉన్నారు. ఇటలీలో లాక్‌డౌన్‌ పొడిగించారు. స్పెయిన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లో లక్షల మంది ఐసొలేషన్‌లో ఉన్నారు. రానున్న నెల రోజులు చాలా కీలకం. ఈ నెలరోజులు కరోనాను కట్టడి చేయగలిగితే మానవళికి అతిపెద్ద ముప్పు తప్పినట్లే.

ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం


కరోనా విలయతాండవానికి ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. లాక్‌డౌన్‌ కారణంగా యూరప్‌, అమెరికా వంటి దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. అమెరికాలో గత రెండు వారాల్లో దాదాపు కోటిమంది నిరుద్యోగభృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. స్టాక్‌మార్కెట్లకు ఏప్రిల్‌ నెల గడ్డుకాలంగా కనిపిస్తున్నది. మొదటి మూడునెలల్లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లన్నీ కుప్పకూలాయి. ఒక మార్చినెలలోనే బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ ఇన్వెస్టర్లురూ. 33.38 లక్షల కోట్లు నష్టపోయారు. గత రెండు నెలలుగా దాదాపు అన్ని రంగాల్లో వర్క్‌ఫ్రం హోమ్‌ కొనసాగుతున్నది. ప్రపంచమంతా సాధారణ స్థితికి రావాలంటే ఒకటి నుంచి రెండు సంవత్సరాల కాలం పడుతుందని అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో ప్రతి ఒక్కరిపై సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా కరోనా ప్రభావం కనిపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు నెలల విరామం తర్వాత వుహాన్‌లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయి.

దేశం
కేసులు
మృతులు
ఒక్కరోజులో
అమెరికా
3,86,239
12,249
+1,378
స్పెయిన్‌
1,40,511
13,897
+556
ఇటలీ
1,35,586
17,127
+604
జర్మనీ
106,739
1,942
+132
ఫ్రాన్స్‌
1,09,069
10,328
+1,417

గత మూడునెలలుగా కరోనా పుట్టుక, విస్తరణ ఇలా..

2019 DEC 31 : సార్స్‌ను పోలిన లక్షణాలతో వుహాన్‌ నగరంలో ఓ వైరస్‌ వ్యాపిస్తున్నదన్న వార్త వెలుగులోకి.

2020 JAN 4 : న్యుమోనియా లక్షణాలతో చైనాలో వైరస్‌ వ్యాపిస్తున్న వ్యాధిపై స్పందించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 

JAN 9 : అతివేగంగా విస్తరిస్తున్న ఆ వైరస్‌కు ‘నావెల్‌ కరోనా 2019’అని పేరు పెట్టారు.

JAN 11 : చైనాలో తొలి కరోనా మరణం నమోదు. 

JAN 23 :  చైనాలో 600 మందికి ఇన్‌ఫెక్షన్‌. హుబెయి ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ ప్రకటన. 

JAN 30 : భారత్‌లో ప్రవేశించిన కరోనా. కేరళలో తొలి కేసు నమోదు

JAN 31 : నాలుగు ఖండాల్లో ఏడువేల మందికిపైగా కరోనా వ్యాధి. అంతర్జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో

Feb 11 : కరోనా వైరస్‌కు కొవిడ్‌-19 అని పేరు పెట్టిన డబ్ల్యూహెచ్‌వో. అనగా కరోనా అనే పేరుగల వైరస్‌ కలిగించే జబ్బు ‘కొవిడ్‌-19’.

Feb 23 : ఇటలీలో కరోనా కేసుల నమోదు

March 11 : కరోనాను మహమ్మారిగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌వో. అప్పటికి 114 దేశాల్లో లక్షా 18వేల కేసులు నమోదు, 4,291మంది మృతి.

March 19 : మరణాల్లో చైనాను దాటిన ఇటలీ.

March 25  :  భారత్‌లో 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ.

March 30 : అమెరికాలో వెయ్యి దాటిన కరోనా మరణాలు.

2020 April 7 : ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 14,10,483


logo