గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 15:19:28

తెలంగాణలో 22కు చేరిన కరోనా బాధితులు

తెలంగాణలో 22కు చేరిన కరోనా బాధితులు

హైదరాబాద్‌: కరోనా బాధితుల సంఖ్య 22కు చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన యువకుడు లండన్‌ నుంచి వయా దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చాడు. ఎయిర్‌పోర్టులో అధికారులు అతడిని పరీక్షించడంతో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరైనా విదేశాల నుంచి ఇండియాకు వచ్చిన వారు చేతికి ముద్ర లేకుండా ఉన్నా, చేతికి ముద్ర ఉండి బయట తిరిగిన ప్రజలు పోలీసులకు, 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 14 రోజుల వరకు ఇంటి నుంచి బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. 

ప్రజలు ప్రయాణాలు, గుంపుగా చేరడాలు, గుంపు ఉన్న చోటికి వెళ్లడం వంటి పనులు చేయకూడదని కోరారు. ఏవైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలన్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. ప్రతి వ్యక్తికి ఒక మీటరు దూరం ఉండాలని, దగ్గినా, తుమ్మినా చేతిని అడ్డుపెట్టుకోవాలని చెప్పారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. 


logo