మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:56:16

వ్యాక్సినేషన్‌కు రెడీ

వ్యాక్సినేషన్‌కు రెడీ

  • సిద్ధమైన రాష్ట్ర యంత్రాంగం
  • తొలి దశలో 80 లక్షలమందికి టీకాలు 

హైదరాబాద్‌,జనవరి 3 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంతో ఇక టీకాలు వేయడమే తరువాయిగా మారింది. వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, పంపిణీ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయగా, తుది దశ పరిశీలనలో వైద్యాధికారులు నిమగ్నమయ్యారు. కనీసం 65 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే, హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెంది వైరస్‌ వ్యాప్తికి దాదాపు అడ్డుకట్ట పడుతుందన్న డబ్ల్యూహెచ్‌వో అంచనాల నేపథ్యంలో త్వరితగతిన టీకా ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నది. తొలి విడుతలో 80 లక్షల మందికి టీకా వేయనున్నారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులు చాలావరకు తగ్గుముఖం పట్టాయి. మరణాల రేటు కూడా దేశంలో 1.4 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నది.

ముందుగా కరోనా వారియర్స్‌కు..

కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి తొలుత టీకా అందించనున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తదితరులకు, తర్వాత 50 ఏండ్ల పైబడిన వారికి, అనంతరం 18 నుంచి 50 ఏండ్ల లోపు ఉండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలన్నది లక్ష్యం. కేంద్రం నుంచి తొలుత 5 లక్షల డోసులు, అనంతరం పది లక్షలు, తర్వాత కోటి డోసుల వ్యాక్సిన్‌ రాష్ట్రానికి రానున్నట్టు తెలుస్తున్నది. అంటే తొలిదశలోని మొత్తం కోటి 15 లక్షల డోసులు పూర్తి చేస్తే 35 శాతం పైగా జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తవుతుంది. అనంతరం రెండో దశలో మరో 30 శాతం పైగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసినా హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెంది వైరస్‌ వ్యాప్తి దాదాపుగా ఆగిపోతుందని నిపుణులు చెప్తున్నారు.  

అందుబాటులోకి వచ్చిన 48 గంటల్లోనే

వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన 48 గంటల్లోనే అవసరమైన వారికి వేసేలా వైద్యారోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధమైంది. రాష్ట్రంలో తొలి దశలో మొత్తం 80 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించగా, ఇందులో ముందుగా టీకాలు అందించే వైద్యారోగ్య సిబ్బంది వివరాలను ఇప్పటికే అధికారులు సేకరించారు. సాధారణ ప్రజలు మాత్రం సొంతంగా కోవిన్‌ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి ఇది ప్రారంభం అవుతుందో కేంద్రం ప్రకటిస్తుంది. 

ప్రత్యేక నిబంధనలూ తప్పనిసరి 

టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతిచ్చినప్పటికీ ఉత్పత్తి విషయంలో అసలు సవాళ్లు ఉంటాయి. ఔషధం కానీ, వ్యాక్సిన్‌ గానీ కనిపెట్టిన తర్వాత ఉత్పత్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు పాటించాలి. ధర నిర్ణయించడంలో డ్రగ్స్‌ ప్రైస్‌ కంట్రోల్‌ ఆర్డర్‌ నిబంధనలు, నేషనల్‌ ఫార్మాస్యూటిక్‌ ప్రైసింగ్‌ అథారిటీ నిబంధనలు అనుసరించాలి. అప్పుడే ఔషధం మార్కెట్‌లోకి వస్తుంది. ఫేజ్‌ 1,2,3 పూర్తి చేసినప్పటికీ వినియోగంలోకి వచ్చిన తర్వాత ఫేజ్‌ 4 నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది. 

-డాక్టర్‌ సంజయ్‌ రెడ్డి, రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్‌ సభ్యులు


logo