నేటి నుంచే టీకా

- వ్యాక్సిన్ సురక్షితం.. భయాలొద్దు
- ఏ టీకా అయినా స్వల్ప సైడ్ఎఫెక్ట్స్ సహజం
- జ్వరం వస్తే వ్యాక్సిన్ పనిచేస్తున్నదని అర్థం
- సమస్య వస్తే చికిత్సకు 57 దవాఖానలు
- 26 దేశాల్లో నిరాటంకంగా వ్యాక్సినేషన్
- ఎక్కడా టీకాల వల్ల మరణాలు లేవు
- లక్షల్లో ఏ ఒక్కరికో దుష్ప్రభావాలు!
- అలర్జీ, రక్తస్రావ సమస్యలున్నా టీకా వేయం
- గర్భవతులు, పాలిచ్చే తల్లులకూ ఇవ్వరు: డీహెచ్‌వో శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి
- 139 కేంద్రాల్లో ఆరోగ్యసిబ్బందికి వ్యాక్సినేషన్
- 4000 మంది వరకు తొలి రోజు టీకా
- 18 ఏండ్లు దాటిన వారికే టీకా
- వారిలో..
- కరోనా సోకి తగ్గిపోయినవారు
- రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు
- హెచ్ఐవీ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు
- 4 నుంచి 8 వారాల తర్వాత టీకాలు
- ప్రస్తుతం కొవిడ్ పాజిటివ్ ఉన్నవారు
- యాంటీబాడీ చికిత్స తీసుకొన్నవారు
- ఏదైనా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు
ప్రపంచదేశాలను అస్తవ్యస్తం చేసిన కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే సమయం రానేవచ్చింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే టీకాల కార్యక్రమం దేశవ్యాప్తంగా శనివారం నుంచి మొదలుకానుంది. కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతించిన నేపథ్యంలో.. తొలి దశలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకాలు వేయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లుచేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయని, వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు భరోసానిస్తున్నారు. చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టుగా భావించాలని చెప్పారు. ఎవరికైనా సమస్య తీవ్రమైతే చికిత్స చేసేందుకు 57 దవాఖానలు సిద్ధం చేశారు. టీకాలు ఎవరెవరికి వేయాలి, ఎవరికి వేయకూడదన్న దానిపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది.
హైదరాబాద్, జనవరి 15 (నమస్తే తెలంగాణ): కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, అయితే వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 139 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. టీకాల సామర్థ్యంపై అపోహలు వద్దని విజ్ఞప్తిచేశారు. మనం ప్రస్తుతం ఎన్నో రకాల వ్యాక్సిన్లు వాడుతున్నామని, కొన్ని టీకాలు వేసిన తర్వాత రియాక్షన్లు కనిపిస్తాయని తెలిపారు. ఇది అత్యంత సాధారణమని చెప్పారు. కొందరికి టీకా వేసిన తర్వాత జ్వరం వస్తుందని గుర్తుచేశారు. దీనర్థం వ్యాక్సిన్‌కు శరీరం ప్రతిస్పందిస్తున్నదని, అంతేగానీ సైడ్ ఎఫెక్ట్స్ కావని స్పష్టం చేశారు. జ్వరం, దురదలు, కండరాల నొప్పి వంటివి అత్యంత సాధారణమైన లక్షణాలని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయని, పారాసిటమల్ వంటివి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. రెండో డోస్ తర్వాత కాస్త ఎక్కువ రియాక్షన్లు ఉండే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
టీకా వల్ల ఎవరూ మరణించలేదు
కొవిషీల్డ్, కొవాగ్జిన్ సామర్థ్యంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం 26 దేశాల్లో టీకాల పంపిణీ జరుగుతున్నదని తెలిపారు. ఏ దేశంలోనూ వ్యాక్సిన్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురికావడం, చనిపోవడం వంటి ఘటనలు నమోదు కాలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు వ్యాధి వల్ల మరణించారే తప్ప టీకా వల్ల ఎవరూ చనిపోలేదన్నారు.
సిద్ధంగా 57 చికిత్సా కేంద్రాలు
వ్యాక్సిన్ వేసిన తర్వాత కలిగే దుష్ప్రభావాలను ‘ఏఈఎఫ్ఐ’ (అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్) అని పిలుస్తామని శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. లక్షల్లో ఒకరికి మాత్రమే తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తాయని చెప్పారు. కరోనా టీకా వేసిన తర్వాత రియాక్షన్లు కలిగితే చికిత్స చేసేందుకు ఏర్పాట్లుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 57 దవాఖానలను సిద్ధం చేశామన్నారు. ఒక్కో కేంద్రంలో కనీసం 10 పడకల ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్లు వంటి సదుపాయాలను ఏర్పాటుచేశామని తెలిపారు. ఈ 57 హాస్పిటళ్లు 80 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకు కొనసాగుతాయని చెప్పారు. దీంతోపాటు టీకా కేంద్రాల వద్ద అంబులెన్సులను, ఇతర వాహనాలను కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు.
కొవాగ్జిన్ మనకు గర్వకారణం
కొవాగ్జిన్ తెలంగాణ గడ్డమీద పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ అని, ఇది మనందరికీ గర్వకారణమని వైద్య అధికారులు చెప్పారు. కొవాగ్జిన్‌పై అపోహలు వద్దని మరోసారి పేర్కొన్నారు. కొవాగ్జిన్ ఇచ్చే సమయంలో తీసుకునేవారి ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా తెలుసుకుంటామని చెప్పారు. వారం రోజులపాటు వారి ఆరోగ్యాన్ని పరిశీలిస్తామని, వారే సొంతంగా మానిటరింగ్ చేసుకోవచ్చని లేదా వైద్యసిబ్బంది వారిని పరిశీలిస్తారని తెలిపారు. ప్రస్తుతానికి కొవాగ్జిన్‌కు మాత్రమే అనుమతి పత్రాలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఆరేడు నెలల్లో 80 లక్షల మందికి టీకాలు
రాష్ట్రంలో మొత్తం 80 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్య అధికారులు పేర్కొన్నారు. ఇందుకు ఆరేడు నెలల సమయం పడుతుందన్నారు. ఈ బృహత్ కార్యంలో 50 వేల మంది వైద్యసిబ్బంది భాగస్వాములు కానున్నట్టు వెల్లడించారు. వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించి పలు సూచనలు చేశారని, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రోజూ అప్డేట్స్ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
1,213 కేంద్రాలకు పెంచుతాం
రాష్ట్రంలో మొదటి విడుత కింద 3.15 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తున్నామని, రెండు మూడు వారాల్లో దశల వారీగా కేంద్రాల సంఖ్యను 1,213కు పెంచుతామని వెల్లడించారు. శనివారం ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేస్తామని, ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని తెలిపారు. వారానికి నాలుగు రోజులు కరోనా టీకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని.. బుధ, శనివారాల్లో పిల్లలు, గర్భిణులకు సాధారణంగా ఇచ్చే ఇమ్యునైజేషన్ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. దవాఖానలో కనీసం 100 మంది సిబ్బంది ఉంటే అక్కడే టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
హెల్త్ వర్కర్లు.. ఆదర్శనీయులు
వైద్యసిబ్బంది గత 10 నెలలుగా వైరస్‌పై పోరాడుతున్నారని శ్రీనివాసరావు, రమేశ్‌రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచేందుకు వ్యాక్సిన్‌ను మొదట వారే తీసుకుంటున్నారని కొనియాడారు. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కోరారు. రాష్ట్రంలో మొదటి వ్యాక్సిన్‌ను దవాఖానల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇస్తామని ప్రకటించారు. కొందరికి రక్తం తొందరగా గడ్డకట్టదని, వారికి టీకా ఇవ్వబోమని చెప్పారు. కండరాల్లో టీకా ఇస్తారని, అందువల్ల స్వెల్లింగ్ (వాపు)వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీపీ, షుగర్ వంటి కోమార్బిడ్స్ ఉన్నవారికి కూడా టీకాలు ఇస్తామని తెలిపారు. యాంటీ వ్యాక్సినేషన్ గ్రూప్‌లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయని, టీకాలపై దుష్ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.
జిల్లాల్లో టీకా కేంద్రాలు
హైదరాబాద్‌లో 13, మేడ్చల్ మల్కాజిగిరిలో 11, రంగారెడ్డిలో 9, ఖమ్మం, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నిజామాబాద్‌ల్లో 6 చొప్పున, వరంగల్ రూరల్, వనపర్తి, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లలో 4 చొప్పున, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణఖేడ్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్‌లో 3 చొప్పున, ములుగు, నాగర్‌కర్నూల్, మంచిర్యాల, మెదక్, జగిత్యాల, జనగాం జిల్లాల్లో 2 టీకా కేంద్రాల చొప్పున ఏర్పాటుచేశారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయి.
ఇవి మన శరీరంలోకి కరోనా వైరస్ వచ్చినప్పుడు అడ్డుకొని వ్యాధి సోకకుండా కాపాడుతాయి. తద్వారా వ్యాధి మరొకరికి వ్యాప్తి చెందకుండా సైకిల్‌కు బ్రేక్ పడుతుంది. దీంతో వ్యాధి సహజంగానే అంతరించిపోయే దశకు చేరుకుంటుంది. దీనికి స్వైన్‌ఫ్లూ ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నాళ్లుగా ఆ వ్యాధి తీవ్రత తగ్గింది. ఈ ఏడాది కేసులే నమోదు కాలేదు.
-వైద్యారోగ్యశాఖ
టీకా వేసుకున్న కొందరిలో కనిపించే లక్షణాలు ఇవీ..
కొవిషీల్డ్
టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి,
అలసట, కండరాల నొప్పి, అశాంతిగా అనిపించటం, జ్వరం, చలి, కీళ్ల నొప్పులు, కడుపులో వికారం.
కొవాగ్జిన్
టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి,
అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు,
ఒళ్లు నొప్పులు, కడుపులో వికారం. వాంతులు, చమట పట్టడం, జలుబు,
దగ్గు, చికాకు, వణుకు.
పై లక్షణాలు ఉన్నవారు ప్యారాసిటమాల్ మాత్ర వేసుకొంటే సరిపోతుంది.
తాజావార్తలు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ
- విశ్వ నగరానికిప్రాంతీయ బాట
- తడిచెత్తతో సేంద్రియ ఎరువు
- ఫలక్‌నుమా ఆర్ఓబీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు
- ఉద్యోగ అవకాశాలు కల్పించేది టీఆర్ఎస్సే..
- దోమల నివారణకు చర్యలు
- వేసవి దృష్ట్యా నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
- కార్యకర్తలే పార్టీకి పునాదులు