శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 14:09:08

మొదటి దశలో 5 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ : డీఎంహెచ్‌ఓ

మొదటి దశలో 5 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ : డీఎంహెచ్‌ఓ

హైదరాబాద్‌ :  రాష్ట్రంలో నాలుగు దశల్లో 80 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,  మొదటి దశలో 5 లక్షల మందికి టీకా ఇవ్వనున్నట్లు డీఎంహెచ్‌ఓ వెంకట్‌ తెలిపారు. మొదటగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకా వేస్తామని ఆయన వెల్లడించారు. రెండో దశలో 50 ఏండ్లు పైబడిన వారికి వేస్తామని చెప్పారు. టీకా పంపిణీ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తిలక్‌నగర్‌లో ఆయన కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహణ తీరును పరిశీలించి మాట్లాడారు. 

క్షేత్రస్థాయి సమస్యలను, చిన్నచిన్న ఇబ్బందులను అధిగమించేందుకే డ్రై రన్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో ఇవాళ హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఏడుచోట్ల కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్‌ నిర్వహణ కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో గాంధీ దవాఖాన, తిలక్‌ నగర్‌ పీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా దవాఖాన, సోమాజిగూడ యశోద దవాఖానతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్ర దవాఖాన, జానంపేట పీహెచ్‌సీ, మహబూబ్‌నగర్‌లోని నేహా సన్‌షైన్‌ దవాఖానల్లో  డ్రై రన్‌ జరుగుతున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.