ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 18:29:39

కరోనా కాలాన్ని.. ప్రగతికి అనుకూలంగా మార్చుకోవాలి

కరోనా కాలాన్ని.. ప్రగతికి అనుకూలంగా మార్చుకోవాలి

కొత్తగూడెం : కరోనాతో ఖనిజ పరిశ్రమలన్ని తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయని, ఈ కష్టకాలాన్ని ప్రగతికి అనువుగా మార్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ప్రణా ళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఇంజినీర్లకు సూచించారు. ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఇండియా) ఆధ్వర్యంలో ‘ఖనిజ పరిశ్రమలపై కొవిడ్‌-19 ప్రభావం’ అనే అంశంపై జరిగిన వెబ్‌నార్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వినోద్‌కుమార్‌ పాల్గొని, ప్రసంగించారు.

కరోనా ప్రభావం అన్ని దేశాల్లోన్ని పరిశ్రమలపై ఉందని, చైనా వంటి దేశాల్లోని విదేశీ పరిశ్రమలు భారత్‌ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహరచన చేయాల్సి ఉంటుందన్నారు. ఖనిజ పరిశ్రమల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పార్లమెంటులో తాను ప్రత్యేక పోరాటం చేశానని గుర్తు చేశారు. అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, యాజమాన్యాలు సైతం మహిళలకు అవకాశమివ్వాలని కోరారు. ఖనిజ పరిశ్రమల ఇంజినీర్లు కరోనా నివారణ చర్యలు పాటిస్తూ ఉత్పత్తి, ఉత్పాదక పెంపుదలకు కృషి చేయాలని, దీంతోనే పరిశ్రమలు మనుగడ సాధిస్తాయని చెప్పారు.

జాతీయ మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ట్రస్టు కొత్త ప్రాజెక్టు చేపట్టే విషయమై డీఎంఎఫ్‌టీ నిధుల వినియోగం, బొగ్గు గనుల వేలం, కమర్షియల్‌ మైనింగ్‌, ఎఫ్‌డీఐలకు అనుమతి, తదితర అంశాలపై నివేదికలు సమర్పించాలన్నారు. జాతీయ స్థాయిలో సింఫర్‌, ఎన్‌ఐఆర్‌ఎం వంటి సంస్థల ఏర్పాటుకు ఉన్న అంశాలపై చర్చించి నివేదిక సమర్పించాలని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.  ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ధి ఐఈఐ తీసుకుంటున్న చర్యలను వినోద్‌కుమార్‌ ప్రశంసించారు.

అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ కరోనా కలిగించిన కల్లోలంలోనూ విజయం సాధించాలని సూచించారు. మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పూర్వ విద్యార్థుల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వారి కోరిక మేరకు ఓయూలో ఎం.ఈ(మైనింగ్‌) కోర్సును ప్రారంభించినట్లు తెలిపారు.

వెబ్‌నార్‌లో సింగరేణి సింరేణి జీఎం (మార్కెటింగ్‌) రవిశంకర్‌ మాట్లాడుతూ కరోనాతో దేశంలో సగానికిపైగా బొగ్గు వినియోగం తగ్గిపోయిందని, విదేశాల్లో సగం ధరకే విదేశాల్లో తక్కువ ధరకు బొగ్గు నిల్వలు విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. సరళీకృతమవుతున్న ప్రభుత్వ విధానాలతో రాబోయే రోజుల్లో విదేశీ సంస్థలతో సింగరేణి లాంటి సంస్థలు పోటీని ఎదుర్కోబోతున్నాయన్నారు. అపార అనుభవంతోనే దేశ ఖనిజ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోగలమని పేర్కొన్నారు. టెన్నికల్‌ సెషన్‌కు సింగరేణి అడ్వైజర్‌ (మైనింగ్‌)  డీఎన్‌ ప్రసాద్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. వెబ్‌నార్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజినీర్లతో పాటు ఆస్ట్రేలియా, స్వీడన్‌ తదితర దేశాల నుంచి మైనింగ్‌ మేధావులు ఉపన్యసించారు.


logo