గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 03, 2020 , 02:33:45

నేటినుంచి గాంధీలో కరోనా పరీక్షలు

నేటినుంచి గాంధీలో కరోనా పరీక్షలు
  • అన్ని టీచింగ్‌ హాస్పిటల్స్‌లో ఏర్పాట్లు
  • అందుబాటులో పల్మనాలజిస్టులు
  • ఒక్క పాటిజివ్‌కేసూ నమోదుకాలేదు
  • అధికారులతో మంత్రి ఈటల టెలికాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని టీచింగ్‌హాస్పిటల్స్‌లో కరోనా వైరస్‌ అనుమానితులకు చికిత్సకోసం ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం నుంచి గాంధీ దవాఖానలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌పై హైఅలర్ట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న పల్మనాలజిస్టులందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం నుంచి గాంధీ మెడికల్‌ కాలేజీలో కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించనున్నారని, ప్రతిరోజూ 30 మందికి పరీక్షలు చేయడానికి కిట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక పరీక్ష చేసేందుకు 10 గంటల సమయం పడుతుందని తెలిపారు. 


ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కకేసు కూడా పాజిటివ్‌గా నమోదు కాలేదని స్పష్టంచేశారు. చైనా నుంచి వచ్చిన ప్రతిఒక్కరూ ఫీవర్‌, గాంధీ, చెస్ట్‌ దవాఖానాలను సంప్రదించాలని విజ్ఞప్తిచేస్తున్నామన్నారు. దవాఖానల్లో చేరినవారికి చికిత్స అందించేందుకు అన్ని వసతులు ఏర్పాటుచేశామని, మాస్క్‌లు, శానిటైజర్లు, సరిపోయేంత మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని వివరించారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సూచనలను కచ్చితంగా అమలుచేస్తున్నామని తెలిపారు. ఎంత ఎమర్జెన్సీ వచ్చినా వైద్యసేవలు అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. గంటగంటకూ పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు ఏ మాత్రం భయపడొద్దని సూచించారు.


logo