శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 09, 2020 , 02:09:48

ఐసీఎమ్మార్‌ ప్రకారమే కరోనా పరీక్షలు

ఐసీఎమ్మార్‌ ప్రకారమే కరోనా పరీక్షలు

  • హైకోర్టుకు వెల్లడించిన ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పరీక్షల విషయంలో ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ హైకోర్టుకు నివేదించారు. రాష్ట్రంలో విస్తృతంగా పరీక్షలు చేయడంలేదని, మృతదేహాలనుంచి నమూనాలు సేకరించడంలేదని రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు దాఖలుచేసిన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం విస్తృతంగా పరీక్షలు ఎందుకు చేయడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. 

అధిక ధరలను నియంత్రించండి

లాక్‌డౌన్‌లో నిత్యావసర వస్తువులు, ఇతర సరుకుల ధరల పెరుగుదలను నియంత్రించాలని హైకోర్టు ఆదేశించింది. ధరల పెరుగుదలపై పత్రికల్లో ఇటీవల వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలని తెలంగాణ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఆదేశాలు జారీచేసింది. ధరల అంశాన్ని ప్రభుత ్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని అడ్వకేట్‌ జనరల్‌  హైకోర్టుకు వెల్లడించారు.  

పండ్ల విక్రయాలకు ప్రత్యామ్నాయమేదీ?

రాష్ట్రవ్యాప్తంగా పండ్ల తోటలను సాగుచేసే రైతులు ప్రస్తుత లాక్‌డౌన్‌లో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి కల్పించిన ప్రత్యామ్నాయాలు, వారికి నష్టాలు రాకుండా తీసుకుంటున్న చర్యలను నివేదించాలని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నిర్మల్‌కు చెందిన రిటైర్డ్‌ వెటర్నరీ డాక్టర్‌ కే నారాయణరెడ్డి హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. మామిడి, బత్తాయి తదితర పండ్ల సీజన్‌ ముగుస్తున్న నేపథ్యంలో ఉత్తర భారత్‌లోని మార్కెట్లకు తరలించేందుకు ఏర్పాట్లుచేయాలని సూచించింది. అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. రైతులనుంచి నేరుగా వినియోగదారుల వద్దకు పండ్లను చేర్చేలా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకున్నదని చెప్పారు. logo