ఆదివారం 24 మే 2020
Telangana - Mar 06, 2020 , 01:38:27

వైరాలో దంపతులకు కరోనా అనుమానం

వైరాలో దంపతులకు కరోనా అనుమానం
  • శాంపిల్స్‌ సేకరించనున్న వైద్యులు

మయూరి సెంటర్‌ (వైరా): కొవిడ్‌-19 లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన దంపతులను గురువారం రాత్రి ఖమ్మం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరు జర్మనీలోని బెర్లిన్‌లో ఉంటున్న తమ కూతురు వద్దకు గత ఏడాది వెళ్లి ఫిబ్రవరి 20న స్వగ్రామానికి చేరుకొన్నారు. గత రెండురోజులుగా ఆ మహిళకు జలుబు చేసి దగ్గు రావడంతో గురువారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ దవాఖానకు వెళ్లగా అక్కడి వైద్యులు ఐఎంఏ వైద్యులద్వారా డీఎంహెచ్‌వోకు సమాచారమిచ్చారు. 


అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ దవాఖానకు పిలిపించి వైద్యపరీక్షలకోసం హడావుడిచేయడంతో భయపడిపోయిన దంపతులు తిరిగి విప్పలమడకకు చేరుకొన్నారు. విషయం తెలుసుకొన్న డీఎంహెచ్‌వో గురువారం రాత్రి ఆ మహిళతోపాటు ఆమె కుటుంబంలో మరో ఇద్దరిని అంబులెన్స్‌ద్వారా ఖమ్మంలోని కరోనా ప్రత్యేకవార్డుకు తరలించారు. వారినుంచి శుక్రవారం రక్తనమూనాలు సేకరించి, వ్యాధి నిర్ధారణకు పుణె వైరాలజీ సెంటర్‌కు పంపనున్నట్లు డీఎంహెచ్‌ మాలతి, ఆర్‌ఎంవో బొల్లికొండ శ్రీనివాస్‌రావు తెలిపారు.


logo