శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:38

ఆక్స్‌ఫర్డ్‌ టీకా సేఫ్‌

ఆక్స్‌ఫర్డ్‌ టీకా సేఫ్‌

  • మొదటిదశ హ్యూమన్‌ ట్రయల్స్‌ విజయవంతం
  • వలంటీర్లలో శక్తిమంతమైన యాంటీబాడీలు
  • టీ- సెల్స్‌ అభివృద్ధి.. వెల్లడించిన యూనివర్సిటీ
  • ప్రారంభమైన రెండు, మూడో దశ ప్రయోగాలు
  • భారత్‌లో ముమ్మరంగా కోవాగ్జిన్‌ ట్రయల్స్‌
  • ప్రాణాపాయం తగ్గించే సినయిర్జెన్‌ ఇన్‌హేలర్‌

వచ్చే నెలలోనే రష్యా వ్యాక్సిన్‌!

రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెరోనికా స్కోర్‌స్కోవా ప్రకటించారు. ఆగస్టు మొదటివారం నుంచి ఈ టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. సెచినోవ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ టీకాపై దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు. ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలువనున్నదని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మూడు కోట్ల డోసులను సమాంతరంగా ఉత్పత్తి చేయనున్నట్టు రష్యా ప్రకటించింది.

లండన్‌/న్యూఢిల్లీ, జూలై 20: కరోనాతో అల్లకల్లోలమవుతున్న ప్రపంచానికి ఒకేరోజు రెండు శుభవార్తలు అందాయి. తాము తయారుచేసిన వ్యాక్సిన్‌ మొదటిదశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ అద్భుత ఫలితాలనిచ్చాయని బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. భద్రతాపరంగా ఈ టీకా అత్యంత సురక్షితమని తెలిపింది. మరోవైపు రష్యాలోని సెచినోవ్‌ యూనివర్సిటీ రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చేనెలలో మార్కెట్లోకి వస్తుందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. ప్రపంచంలో మొదటిసారి అందుబాటులోకి వస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇదే. కాగా, మనదేశంలో వ్యాక్సిన్‌ తయారీలో ముందున్న భారత్‌ బయోటెక్‌ తన కోవాగ్జిన్‌ టీకాపై హ్యూమన్‌ ట్రయల్స్‌ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 150 వ్యాక్సిన్లు వివిధ ప్రయోగ దశల్లో ఉన్నాయి. 

ఆశలురేపుతున్న ఆక్స్‌ఫర్డ్‌

కరోనాతో అతలాకుతలమవుతున్న ప్రపంచమంతా టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వేళ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రకటన ఆశలు రేపుతున్నది. ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రస్తుతం మూడో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌లో ఉన్నది. మొదటిదశలో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించింది. టీకా ఇచ్చిన అందరిలో వైరస్‌ యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ చూశామని జెన్నిఫర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అడ్రియాన్‌ హిల్‌ చెప్పారు. వైరస్‌ను నిలువరించే యాంటీబాడీస్‌తోపాటు భవిష్యత్తులో కరోనాతో పోరాడే టీ సెల్స్‌ కూడా పెరిగాయని తెలిపారు. బ్రిటన్‌లో గత ఏప్రిల్‌ నుంచి మే వరకు ఐదు దవాఖానల్లో మొదటిదశ హూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. 18-55 ఏండ్ల మధ్యవయస్కులు 1,077 మందిపై నిర్వహించిన ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను లాన్సెట్‌ మెడికల్‌ జర్నల్‌లో సోమవారం ప్రకటించారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన 56 రోజులవరకు శరీరంలో యాంటీబాడీలు, టీ-సెల్స్‌ భారీగా అభివృద్ధి చెందాయని పరిశోధన వ్యాసం సహరచయిత సారాగిల్బర్ట్‌ తెలిపారు. త్వరలో అమెరికాలో 30వేల మందిపై ట్రయల్స్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఏజెడ్‌డీ1222గా పిలిచే ఈ టీకాను ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిధిలోని జెన్నిఫర్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసింది. భారత్‌లో ఆగస్టులో ఈ టీకా ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌  ఈ టీకాను ఉత్పత్తి చేయనున్నది. 

కొనసాగుతున్న కొవాగ్జిన్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకాపై హ్యూమన్‌ ట్రయల్స్‌ నిరాటంకంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని నిమ్స్‌, ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ట్రయల్స్‌ ప్రారంభించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మరింతమందిపై ట్రయల్స్‌ నిర్వహించేందుకు వాలంటీర్లను నియమించే కార్యక్రమం ప్రారంభించామని సంస్థ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. హైదరాబాద్‌లో ఇద్దరు వలంటీర్లకు వైద్యులు కొవాగ్జిన్‌ ఇచ్చారు. ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సహాయంతో భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. 

రిస్క్‌ తగ్గించే సినయిర్జెన్‌ ఇన్‌హేలర్‌

బ్రిటన్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ సినయిర్జెన్‌ తాము తయారుచేసిన ఇన్‌హేలర్‌ ‘ఇంటర్‌ఫెరాన్‌ బీటా’ కొవిడ్‌ రోగులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపింది. దాదాపు 100 మందిపై పరీక్షల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది. మందు ఇచ్చినవారిలో 80% రిస్క్‌ తగ్గిందని తెలిపింది. కొవిడ్‌ రోగులు ఊపిరి తీసుకోవటంలో ఇది బాగా ఉపయోగపడుతుందని, వెంటిలేటర్‌ అవసరాన్ని తగ్గిస్తుందని సినయిర్జెన్‌ సీఈవో రిచర్డ్‌ మార్స్‌డెన్‌ తెలిపారు.

స్వీడన్‌కు చెందిన లైఫ్‌సైన్స్‌ సంస్థ ఎంజైమాటికా తమ మౌత్‌ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లో కరోనా వైరస్‌ను నిరోధించవచ్చని ప్రకటించింది. ఇది వైరస్‌ను క్రియారహితం చేస్తుందని తమ ప్రాథమిక ఫలితాల్లో తేలినట్టు చెప్పింది. అలాగే నోటి నుంచి వ్యాపించే ఇతర వైరస్‌లను కూడా నిరోధిస్తుందని తెలిపింది.logo