గురువారం 28 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 18:16:59

బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

నల్లగొండ :  జిల్లాలోని కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల బ్రిటన్‌ దేశం నుంచి రాగా అతనికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్యాధికారులు నిర్ధారించారు. ఆ వ్యక్తి వారం రోజుల క్రితం తన కుమారుడి పుట్టు వెంట్రుకలు తీసేందుకు బ్రిటన్‌ నుంచి కుటుంబంతో కలిసి తన స్వస్థలమైన తుంగతుర్తికి చేరుకున్నాడు. అతని నుంచి శాంపిల్స్‌ సేకరించి హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. 

అనంతరం అతను కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో హోంక్వారంటైన్‌లో ఉంటున్నాడు. శుక్రవారం పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. బ్రిటన్‌లో కరోనా స్ట్రెయిన్‌ అనే కొత్త రకం వైరస్‌ కలకలం రేపుతుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఇంటి వద్దకు వెళ్లి అతడిని కలిసిన బంధువులు, అతడి స్నేహితుల్లో తీవ్ర కలవరం నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితుడు హోంక్వారంటైన్‌లో ఉన్న సమయంలో అతని వద్దకు ఎవరెవరు వచ్చారో ఆరా తీస్తున్నారు. శుక్రవారం బాధితుడి కుటుంబ సభ్యులైన ఐదుగురి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపారు. శనివారం మరికొంత మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించనున్నట్లు అధికారులు తెలిపారు. 


logo