గురువారం 16 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:16:41

థ్యాంక్స్‌ టు తెలంగాణ గవర్నమెంట్‌

థ్యాంక్స్‌ టు తెలంగాణ గవర్నమెంట్‌

  • ప్లాస్మాతో గాంధీ దవాఖానలో పునర్జన్మ
  • ప్రైవేట్‌లో రోజులు లెక్కపెట్టుకొమ్మన్నారు
  • కరోనా నుంచి కోలుకున్న బాధితుడి మనోగతం
  • ఇప్పటివరకు ఐదుగురికి విజయవంతంగా చికిత్స

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా బాధి తులకు గాంధీ దవాఖానలో అందుబాటులోకి తీసుకొచ్చిన ప్లాస్మా థెరపీ ఒక ఆశాకిరణంగా మారింది. గాంధీలో తొలిసారిగా మే 14న హైదరాబాద్‌కు చెందిన ఒక బాధితుడికి ప్లాస్మాథెరపీ చేశారు. ఇప్పటివరకు ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్స అందించామని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. వారంతా పూర్తిగా కోలుకున్నట్టు చెప్పారు. గాంధీలో తొలి ప్లాస్మా థెరపీ చికిత్స పొంది డిశ్చార్జి అయిన వంశీకృష్ణ తన అనుభవాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ‘మా స్వస్థలం ఖమ్మం. వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నా. 

మా అమ్మకు ఆరోగ్యం బాగాలేక ఏప్రిల్‌ 27న మలక్‌పేటలోని ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌ లో చేర్పించా. నేను అమ్మతోనే దవాఖానలో నాలుగురోజులు ఉ న్నా. మే 3న అల్వాల్‌లోని మా ఇంటికి వచ్చా. తర్వాత తీవ్ర చలి జ్వరం వచ్చింది. సికింద్రాబాద్‌లో ఒక కార్పొరేట్‌ దవాఖానకు వెళ్లగా.. రెస్పిరేటరీ ప్రాబ్లం అన్నారు. మందులు వాడినా తగ్గలేదు. మే 8న శ్వాససమస్య మొదలైంది. అల్వాల్‌లోని మరో ప్రైవేట్‌ దవాఖానలో చేరితే రెస్పిరేటరీ సిస్టం ఫెయిలైంది.. ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అన్నారు. ఒక్కసారిగా షాకయ్యా. మే 11న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ దవాఖానలో కరోనా టెస్ట్‌ చేయించగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో 12న నన్ను గాంధీకి తరలించి ఐసీయూలో పెట్టారు. 

ఇక నేను ప్రాణాలపై ఆశలు వదులుకున్నా. కానీ డాక్టర్‌ రాజారావు ధైర్యం చెప్పారు. అప్పుడే ప్లాస్మా థెరపీ గురించి చర్చ జరిగింది. తొలిసారి నాకే ప్లాస్మా చికిత్స అందించనున్నట్టు డాక్టర్లు చెప్పారు. మే 14న మొదటిసారి ప్లాస్మా థెరపీ ఇచ్చారు. దాదాపు గంటన్నరకుపైగా జరిగిన ఈ చికిత్స సమయంలో డాక్టర్లంతా నా పక్కనే ఉన్నారు. ఆ తర్వాత రెండు రోజులకోసారి టెస్టులుచేశారు. మే 16న రెండోసారి ప్లాస్మా ఇచ్చారు. దీంతో నేను 16 రోజులపాటు చికిత్స పొంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యా. కుటుంబసభ్యులే దగ్గరకు రావడానికి భయపడుతున్న సమయంలో డాక్టర్‌ తిలోక్‌, డాక్టర్‌ హేమంత్‌ బృందం ఐసీయూలోని ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ ట్రీట్‌మెంట్‌ చేశారు. ఆ టీమ్‌ను లీడ్‌చేస్తున్న డాక్టర్‌ రాజారావు సార్‌ ఈజ్‌ ఎ వెరీ గుడ్‌ అండ్‌ డైనమిక్‌ పర్సన్‌. ఐ థ్యాంక్‌ టు ఆల్‌ గాంధీ హాస్పిటల్‌ స్టాఫ్‌ అండ్‌ తెలంగాణ గవర్నమెంట్‌' అని చెప్తుకొచ్చారు.


logo